పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88 రాధికాసాంత్వనము

సీ. చిక్కనికౌఁగిళ్ళఁ జిక్కి మై మఱచుచు
ఱొమ్ము ఱొమ్మున నాని రోజుకొనుచు
నొక్కరికెమ్మోవి యొక్కరు మార్చుచుఁ
గలగల్పుమణితము ల్పలుకుకొనుచు
నెదురుయ్యలల నెక్కి యెలనాగయును దాను
జిగినోటిమడుపులు చేకొనుచును
గళ లీనుచెక్కుల నెలవంక లీనఁగాఁ
దిలకము ల్కొనగోళ్ళ దిద్దుకొనుచు
తే. నచట వేసినతెర వేసినట్టులుండ
సరిగచౌశీతిబంధము ల్సలుపుకొనుచుఁ
జెలఁగు వనమాలిఁ జేరితి సిగ్గుమాలి
వరుస నెటు తోడితెత్తు నోవన్నెలాఁడి. 53

క. తల కెక్కినవలపున హరి
యలయిళ దాసానుదాసుఁడై మెలఁగంగాఁ
గలవె యిఁక నేటియాసలు
కలి పోసినవెనుక నుట్టి కనుఁగొనుమాడ్కిన్. 54

వ. అనిన విని మనస్సునఁ బట్టరానికినుక పొడమినంత. 55

చ. అదరెడుమోవి తొట్రుపడుయానముఁ గుచ్చెల జాఱుపైఁటయున్
జెదరినముంగురుల్ మిగులఁ జింతిలుచిత్తము వాడుమోము లోఁ
బొదలెడివాంఛ గద్గదిక మోడ్పుకనుంగవ మీఱ మారుచే
బెదరుచు లేచి యామెలఁత వెన్నునిపైఁ దగుమచ్చరంబునన్. 56

సీ. జడ వేగ వదలించి ముడిపూలు విదలించి
యలజడిఁ గీల్గంటు నందగించి
కలసొమ్ము లెడలించి వలయము ల్చిట్లించి
నుదుటఁ గస్తురిబొట్టు కదియ నుంచి