పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్ధర నెన్నఁగ సతతంబులె | తిరముగ సత్కీర్తిదక్క ధీరాత్ములకున్?


క.

మునుదీక్ష యొసఁగువేళల | ఘనుఁడగు గురునాథుఁ డెంత గాదని యనినన్
విననొల్లక వ్రతభంగం | బొనరింపఁదలంచు టిప్పు డుచితం బగునే?


క.

అది గావున నవ్విటునకు | నొదుఁగక పట్టంపుదేవి నొసఁగి ధరిత్రిన్
విదితంబగు శపథము కో | విదు లెన్నఁగ నిల్పుకొనుట విహితం బనుచున్.


చ.

అవనితలేంద్రుఁ డెంతయరయంబ గృహంబున కేగి సంతత
ప్రవిమలశీలయైన తనభామిని నొయ్యనఁ జేరఁబిల్చి యో
ధవళసరోజనేత్ర! విను ధర్మయుతంబగు నొక్కవాక్యమున్
దవిలినభక్తితోడ విదితంబుగ నీ కెఱుఁగంగఁ జెప్పెదన్.


చ.

సరసము మీఱ నొక్కవిటజంగము ధూర్జటిఁ బోలి నేఁడు దా
నురుతరలీల నెయ్యెడలనుండియొ వేగమె చేరిన న్సభాం
తరమునఁ జూచి యెంతయు ముదంబున దీవెన లిచ్చి కేరుచున్
గురుతుగ నొక్కవారసతిఁ గోర్కె నొసంగు మటంచుఁ బల్కినన్.


క.

ఇయ్యకొని భటులచేతికి | నెయ్యంబున ధన మొసంగి నెఱి నొకపడుపుం
దొయ్యలిఁ దెమ్మని పనిచియు | నయ్యెడ వారలను నమ్మ కతిశీఘ్రమునన్.


సీ.

చని వేశ్యవాటియెల్లను క్రమక్రమమున వెదుకంగ నందు నవ్వెలఁదులెల్లఁ
బల్లవసహితలై పరిపరివిధముల గుఱుతుగా మరుకేళిఁ గూడుచున్నం
గనుఁగొని వ్రతభంగమునకు నెమ్మదిఁ జాల వెఱచి యెంతయును వివేకినివని
నీకు నివ్విధ మెల్లఁ బ్రాకటం బలరారఁ దెలుపవచ్చితి నతితీవ్రఫణితి
నిందుముఖి యెన్నఁడు నెఱుంగ నిట్టిచోద్య | మభవు బలుమాయ గాఁబోలు! నైన నీదు
బుద్ధితోడుత నూహించి పొసఁగ నొక్కవాక్య | మిట్లని పల్కుమా వలను మీఱ.


క.

అనుమనుజాధీశ్వరునిం | గని మృదుమధురోక్తు లలరఁ గాంతామణి యి
ట్లను హృదయాధీశ్వర మును | వినవే శితిగళునికథలు విబుధులవలనన్.


చ.

చిరతరలీల భక్తతతిచిత్తము లారయఁగోరి యీశ్వరుం
డరుదుగఁ బెక్కురూపుల నహర్నిశము న్జరియించుఁ దొల్లియుం
దురితవిదూరుఁడైన చిరితొండని నిశ్చలభక్తిఁ జూడఁ ద
ద్వరసుతుఁ గూరఁగా నడిగి వానికి నీఁడె మనోరథార్ధముల్!


గీ.

అవ్విభుఁడె మున్ను పొదిలె నిమ్మవ్వసుతునిఁ | బూని చంపించుకొఱకునై పోయి దాని