పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భిన్నత మీఱఁగ నటువలె | విన్నప మొనరింప ధరణివిభుఁ డవ్వేళన్..


ఉ.

ఎక్కడఁ జూచినం బురి నొకించుకయు న్నెడలేక యెప్పుడు
న్లెక్కకు నెక్కువై గడనలేమలు గాచుకయుందు రిప్పు డే
దిక్కున నొక్కవారసుదతీమణి గల్గకయుండు టెంతయు
న్మిక్కిలిచోద్య మంచు మది నిల్వక దిగ్గున లేచి యత్తఱిన్.


క.

నల్లనిశాలుముసుం గిడి | యెల్లజనంబులను డించి యింపొంద మహీ
వల్లభుఁడు తానె చనియె మ | హోల్లాసఁపువేశ్యవాటి కున్నతలీలన్.


ఉ.

ధీరుఁడు భూవరుం డిటులఁ దీవ్రగతిం జని తద్గృహంబుల
న్సోరణగండ్లపద్ధతులఁ జూడఁదొడంగె విచిత్రలీలల
న్గేరుచుఁ గోరికన్ మదనకేళులఁ దేలుచునుండువారలం
భూరిసుగంధపుష్పమణిభూషణధారుల నిర్విచారులన్.


 * * *


వ.

ఇట్లు చతురశీతిబంధనఖదంతక్షతపరిరంభణాద్యనేకకామశాస్త్రప్రకారంబు
లం దవిలి క్రీడించుచున్నం గనుంగొని శివశివేతి మంత్రంబును బఠించుచు విఫలప్రయ
త్నుండై ధాత్రీవల్లభుండు తనమనంబున వితర్కించె.


క.

చారులు చెప్పినవిధ మిపు | డారయఁ దథ్యంబయ్యె నవ్విటునకు నిం
కేరీతి కొనఁగఁగల్గుదు | వారవధూమణీని వ్రతము వడి నిల్పుటకున్.


క.

వెలపొలఁతి గల్గనందున | నిల యేలెడురాజు నంచు నెవ్వతెనైనం
బలిమిం దెప్పించిన నిది | కలుషంబుల కెల్ల మొదలుగాదె తలంపన్?


చ.

కడునడురేయి యయ్యెనని కల్లరిజంగము క్రోధచిత్తుఁడై
వడి నదలించి పల్కునొకొ? వంచన మీఱ వ్రతంబుమీఁదట
న్విడువఁగఁబోలునో? భువిని విశ్రుతమౌ నపకీర్తి నొందఁగాఁ
బడునొకొ? నీలకంధరుని భాస్వదనుగ్రహ మెట్టు లున్నదో?


గీ.

వేశ్య నొసఁగెదనని మున్ను విశ్వసింపఁ | బలికి యిపు డెట్లు బొంకుదుఁ బాటిఁ దప్పి
మహి నసత్యముకన్నఁగ ల్మషముగ లదె | సేటు సేయంగ మానవకోటులకును?


గీ.

మును హరిశ్చంద్రముఖ్యులౌ మనుజపతులు | నిత్యసత్యవ్రతాచారనిపుణు లగుటఁ
గాదె చీరకీర్తి సకలజగంబులందుఁ | జెంది నిర్వాణరాజ్యాభిషిక్తులైరి.


క.

కరిహయభటరథశిబికాం| బరధనమణిభూషణాదిబహువస్తువు లి