పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజశేఖరవిలాసము

21


బిడిగంటలును గేకిపింఛంపుఁగుంచెలు ఛత్రముల్ బులితోళ్ళచామరములు
యోగదండంబులు యోగపట్టెడలును గండపెండేరము ల్కుండలములు
తనువుల భూతిపూతలు కావివస్త్రముల ల్మేలైనరుద్రాక్షమాలికలును
శ్వేతకేతనములు రుద్రవీణియలును | బాత్రమగునట్టిరజతంపుఁబాత్రికలును
గేలు దామరఁ బలువైనశూలములును | మొలకబంగరుగిలుకుపావలును గలిగి.


సీ.

అతులితవిమలపంచాక్షరీమంత్రంబు మించి కోరిక బఠియించువారు
తరుచుగా శైవకథారహస్యార్థము ల్నెఱిశిష్యవరుల కేర్పఱచువారు
సారేసారెకు "నమశ్శర్వాయ రుద్రాయ పశుపతయే” యనిపల్కువారు
నడుగడ్గునకుఁ గాహళాదిరవంబులు చెలఁగించుచును వేడ్క నలరువారు
చిత్రగతులను గానంబుఁజేయువారు | సరవితో గద్యపద్యము ల్జదువువారు
నగుచుఁ గోటానకో ట్లొకమొగిని నడువ | సాగిరా నేలయీనినచందమునను.


సీ.

మల్లయ్య వీరయ్య మఱివిరూపాక్షయ్య జడముడిబసవయ్య శంకరయ్య
పిడిఘంటచిక్కయ్య భీమయ్య సోమయ్య శివ్వయ్య హరిణాంకశేఖరయ్య
మరులయ్య సంగయ్య మార్కొండలింగయ్య పర్వతనాథయ్య పశుపతయ్య
శరభయ్య రుద్రయ్య కరపాత్రసిధ్ధయ్య శితికంఠయోగయ్య శ్రీగిరయ్య


గీ.

విశ్వనాధయ్య వీరమాహేశ్వరయ్య | యాదిగాఁ బేరుగల్గి మహాత్ములయిన
జంగమస్వాము లారాజసముఖమునకు | సరగఁ జనుదెంచి రత్యంతసంభ్రమమున.


వ.

ఇవ్విధంబునఁ బఱతెంచి నృపాలుం గాంచి.


శా.

ఏరా! భూవర! మాకుఁ గాంచనతురంగేభాంబరాందోళికా
భూరిస్యందనమందిరోపవనసద్భూషామణిశ్రేణులున్
జేరం గావునఁ బల్లెలున్ బళువులున్ లెక్కింప కర్థంబు మా
కీరా! కోరికఁ దీర మీఱకిఁక నీ వెంతేనియున్ ధీరతన్.


క.

పాలుపెరుగేక్షురనమునుఁ | జాలఫలరసములు దేనె శర్కరఘృతమున్
మేలగుకజ్జంబులు నీ | వేళకుఁ దెప్పించరోరి వేగమె మాకున్.


మ.

అనుచుఁ గోరినజంగమయ్యలకు నత్యానందచేతస్కుఁడై
మనుజాధీశ్వరుఁ డర్ఘ్యపాద్యవిధులన్ మన్నించుచుం గాంచనా
సనము ల్వెట్జి బహుప్రకారములఁ బూజల్చేసి యశ్రాంతమున్
ధనధాన్యాంబరముఖ్యవస్తువులచేత న్బ్రీతిఁ గావించుచున్.