పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

ప్రథమాశ్వాసము


క.

అడిగినవస్తు వొకింతయుఁ | దడయక యాక్షణమునందె తాత్పర్యముతోఁ
గడువడి నొసఁగుచు భూపతి | పుడమిన్ బ్రతివాసరంబు బ్రోది యొనర్పన్.


క.

జంగంబులెల్ల నచట భు | జంగమరాజాంగదుని వెసం గొల్చుచునో
జంగములై వసియించిరి | బంగరపుమఠంబులందు భాసురలీలన్.


వ.

ఈక్రమంబున నద్ధరాధీశుం డతులితధర్మమార్గప్రచారుండై ప్రతిదినజంగమారాధ
న చేయుచుండె నని సూతుం డెఱింగించిన నైమిశారణ్య మహామును లఁటమీదికథా
వృత్తాంతం బెట్లని యడుగుటయును.


ఉ.

హారతుషారహీరశరదభ్రనిశాకరతారకాబ్జడిం
డీరమరాళపారదపటీరవియత్తటినీసితాభ్రమం
దారసురేంద్రనాగకలధౌతసుధారసనన్నిభోజ్వలా
కారలసద్విహారసుమకాండవిదార యుదారశంకరా.


స్రగ్విణి.

చారుకారుణ్యవిస్తారతారేశకో | టీరదైత్యేభకంఠీరవేంద్రాదిబృం
దారకానీకమందారసత్యవ్రతా | చారగోరాజసంచార గౌరీశ్వరా.


తురగవల్గనము.

ధరణిధరవరశరణచిరశుభదాయకా హరిసాయకా
తరణిశశిశుచిశయనదురితవిదారణాలయకారణా
పరమపురుష హరిహయవినుత పురభంజనా మునిరంజనా
హర గరళగళ మదదనుజభయంకరా జయశంకరా.

గద్య.
ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర ఘన
యశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్ర
బుధజనవిధేయ తిమ్మయనామధేయప్రణీతంబైన రాజశేఖరవిలా
సంబను కావ్యంబునందుఁ బ్రథమాశ్వాసము.