పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

ప్రథమాశ్వాసము


రాజసంబున నంతఃపురంబు వెడలి | ఘనత నుర్వీశుఁ డాస్థానమునకుఁ జనియె.


సీ.

చాలుచాలునఁ జాలు నీలంపుఁ బగడంపుఁ గంబము ల్మితిలేని కాంతిఁ దనర
గారుత్మతపుమణు ల్గదియించినట్టి మేల్మేడగోడలు సొంపు మీఱి యలర
నిందుకాంతముల బొల్పొంద నొనర్చినసోపానములు వింతశోభ లెసఁగ
వెలలేనివజ్రంపువేదిక ల్చెలువాఱ గోమేధికపుగవాక్షులు చెలంగ
నతులవైడూర్యపుష్యరాగాదినీల | రత్నవస్తువు లెంతయు రమణ మెఱయఁ
గ్రొత్తముత్తెఁపుబెత్తులు గొమఱు మిగులు | కొలువుకూటంబునందునఁ గూర్మితోడ.


క.

కురుమగధచోళమాధవ | కరహాటమరాటలాటకర్నాటకఘూ
ర్జరయవనముఖ్యధరణీ | వరులెల్లం గొలువ భూరివైభవలీలన్.


సీ.

వేదశాస్త్రపురాణవివిధరహస్యము ల్వరునతోఁ గవిబుధావళులు దెలుప
సంగీతనృత్తారాదిసరసవిద్యాప్రౌఢి కడువేడ్క నర్థిసంఘములు నెఱప
శైనవైష్ణవజైనచార్వాకబౌద్ధశాక్తేయులు తన్మతక్రియలు సెప్ప
కరవాలశూలతోమరభిెండివాలాదిశస్త్రసాధకులు ప్రసిద్ధిఁ జూప
రమణు లిరుఁగడ వింజామరములు వీవఁ | గడఁగి డెబ్బదిరెండగుఘననియోగ
ములఁ దవిలి రత్నపీఠాగ్రమునఁ జెలువుగఁ | గొలువుఁ గూర్చుండె మేదినీతలవిభుండు.


క.

అతులితవిభవంబున నీ | గతిఁ గొల్వున నుండి యచటఁ గలజనములకుం
గుతుకం బొప్పఁగ ధరణీ | పతి దా నపుఁ డిట్టులనుచుఁ బలికెం బ్రేమన్.


చ.

వినుఁ డిది యాది గాఁగఁ బృథివిమగల జంగమకోట్లకెల్నుం
గొనకొని నప్పదార్థముఁలఁ గోరినయంతనె పూన్కితోడ లే
దన కరయంబు మీఱ ననయంబును నిత్తణ వృషాధిరాజవా
హనునకుఁ బ్రీతి గాఁగ జగమంతయు మెచ్చఁగ నుత్సవంబునన్.


గీ.

ప్రజలకెల్లఁ దెలియఁ బ్రతిన గావించెద | నడుగకున్నవారి కరయ నొట్టు
జేరి యానతోడఁ గోరినవారల | కీయలేనివాని కిదియె యొట్టు.


క.

అని పలికి సకలదిశలం | బనివడి చాటింపంబనిచి బాగుగ మొగసా
లను గంట వ్రేలఁగట్టిం | చెను జనములకెల్లఁ గడువిచిత్రము మీఱన్.


వ.

పట్లు శపథంబు గావించి దిశలం జాటించిన దద్వృత్తాంతం బంతయు విని క్రమంబున.


సీ.

కక్షపాలరు పైడికట్లబెత్తంబుల శంఖసంఖ్యల మించు శంఖములును