పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజశేఖరవిలాసము

15


క.

శరణార్థి యగుచు శిరమున | గురుపదతీర్థంబుఁ జల్లుకొని సద్భక్తిం
బరివర్ణించుచు నొయ్యన | మరలెం బురి కధికసంభ్రమం బలరారన్.


ఉ.

అంతఁ గొఱంతలేక జలమంతయుఁ జెంత ననంతవాజులన్
దంతుల నెక్కి యెంతయు నితాంతజవంబున నంతకంతకుం
బంతము మీర వింతలుగ బంతులు సాగి యొకంతరాఁగ భూ
కాంతుఁడు సొచ్చె నప్పురము కాంతలు సేసల జల్లుచుండఁగన్.


చ.

అలికులవేణు లెల్ల మణిహర్మ్యతలంబుల నిల్చి చెల్వుగాఁ
గలువలు నాణిముత్తెములు గాఢముగాఁ బయింజల్ల నప్పు డ
జ్జలజహితాన్వయుం డలరెఁ జారుతరంబుగఁ దారకాగణం
బులు బలుదిక్కులం గొలువఁ బొల్పగుచల్లనిచంద్రుఁడో యనన్.


గీ.

రమణఁ దళుకొత్త మేదినీరమణునకును | బసిఁడిపళ్ళెరములను దీపముల నుంచి
రమణు లతనునికంఠహారమణు లనఁగ | నిచ్చ నలరుచు నారతు లిచ్చి రపుడు.


గీ.

ఇందుకాంతావళులభావమెల్లఁ గఱఁగ | రా జుదయఁబర్వతమునుఁ జేరంగనెఱిఁగి
యిందుఁ గాంతావళులభావమెల్లఁ గరఁగ | రాజుదయఁబర్వతమునుఁ జేరంగ నెఱిగి.


వ.

ఈచందంబునఁ బౌరసుందరీసందోహం బందంబగు నానందంబు డెందంబులం
గ్రందుకొన నందందపయిం దొఱంగించెడు కుందాది సుముబృందంయుల గంధం
బు లుపొందుగా హృదయారవిందంబులకు విందొనర్ప వందిమాగధులు ముందర సం
దడిగొని వినుతింప దివ్యదుందుభినాదంబులు చెలంగఁ గందర్పసుందరుండగు న
వ్వసుంధరాపురందరుండు మందహాసం బొదవ నిజమందిరంబు బ్రవేశించి తనయిం
దుముఖలుం దానును సుఖంబున వసించినంత.


మ.

సరసీజోద్భవరుక్మకారకుఁడు ఘనస్త్రీమణిం బ్రేమతోఁ
గరమింపొంద నలంకరించుటకు వేగం గాఁచి తా నీటిలో
బరగన్ ముంచినయట్టిమేల్మియగు బల్బంగారపుంబూదెయ
న్కరణిన్ భానుఁడు పశ్చిమాంబునిధి జక్కం గ్రుంకె నొక్కుమ్మడిన్.


గీ.

రాజు కువలయ మలరింప రాఁదలంచు | టెంచి సమయాధికారి గట్టించినట్టి
భవ్యకల్హారతోరణపంఙ్తి యనఁగ | సాంధ్యరాగము విలసిల్లె సాంద్రముగను.


మ.

గురుపత్నిన్ వరియించుద్రోహి తనుఁ గన్గోరాదటంచున్ సుధా
కరురాకల్ మది నెంచి పద్మిని సువక్త్రంబుం గడున్వంచె న
ట్లరయం బుణ్యవధూమణుల్ ధరణి నత్యంతోగ్రదోషాత్మునిన్.