పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ప్రథమాశ్వాసము


టెను విను భూవరా! మునుపటింబలె నూరకరతోమం
చినదియే మేలుసుక్యుశాఖరు నెమ్మదిగా జంకేయుచుఁ".


క.

అదియును గా కొకయెడ గుఱి | వదలి వెసన్ శిష్యువరుఁడు వ్రతభంగముచేఁ
బొదవినయప్పు డొకించుకఁ | గొదవంటుఁజుమీ! తలంప గురునాథునకున్.


ఉ.

నావుడు రాజశేఖరుఁడు నవ్వలరన్ గురుఁ జూచి పల్కె నో
దేవ! భవత్ప్రసాదమున ధీరత మీఱఁగఁ దద్ర్వతంబు పృ
థ్వీవరు లెల్ల నెన్నఁగను వేడ్క నొనర్చెద సంశయంబు మీ
భావమునందు నిల్పక కృపామతి నానతియీవె శీఘ్రతన్.


మ.

అరవిందోదరతుల్యపుణ్యయుతకార్యారంభసంరంభవి
స్ఫురితాకీర్ణదృఢాంతరంగ మితరంబుల్ గోరుటల్ నేర్చునే?
చిరగీర్వాణతరంగిణీవిమలవీచీజాలలీలానిరం
తరసంతోషితరాజహంస మిరవొందం జేరునే వాగులన్.


వ.

అదియునుం గాక.


సీ.

సతి నమ్ము మును హరిశ్చంద్రభూనాథుండు సత్యంబు నిలుపఁడే జగమెఱుంగఁ?
దనతండ్రియానతిం దప్పక హర్షించి రాజ్యంబు వదలఁడే రాఘవుండు?
శిబిచక్రవర్తి వాసిగఁ దొల్లి డేగకుఁ గొనకొని దేహంబుఁ గోసియీఁడె?
ఘనత మీఱఁ బరోపకారార్ధము దధీచి తా నస్థు లొసఁగఁడే తనువు విడిచి?
వారలెల్లను బృథ్వి యున్నారె యిపుడు? | సలలితంబగు ప్రఖ్యాతి వెలసెఁగాక
వినుము గురునాథ! యిఁకఁ బెక్కు లనఁగ నెందు | కటులసత్కీర్తి నిలిపెద నవనియందు.


చ.

జలనిధు లింకినన్ ధరణిఁజంద్రుడు గ్రుంకిన వేధ జంకినన్
జలజలమంచుఁ జుక్కలు కృశయయి డుల్లిన భూమి గ్రుంగినం
గులగిరురెల్లం బెల్లగిలి కూలిన దిక్కరులోలి మ్రొగ్గినం
బొలుపుగ నీవ్రతంబు పరిపూర్తి యొనర్తు శివుండు మెచ్చఁగన్.


వ.

మహాత్మా! మీయనుగ్రహంబువలన మన్మానసంబు సంతోషించుచున్నదనియది మీ రిందుల
కు సంశయింపక శీఘ్రం బానతీయవలయునని ప్రార్థించిన.


గీ.

ఇన్నివిధముల నీమది నెన్ని చూచి | గట్టిగా గురి నిలుపగలట్టులైన
భూమిపాలక మాచేతిభూతి యంది | భూతనాథుని మెప్పింపు ఖ్యాతిమీఱ.


క.

కరుణారసపూరితహృ | త్వరవిజుఁడై యపుడు గురుఁడు జనపతినొసటన్
సరగున భూతి యొకించుక | తిరముగ నిడి యాజ్ఞ నొసఁగ దినకరకులుఁడున్.