పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజశేఖరవిలాసము

11


కామినీమణిజంఘికలు మకరంబులు చానపిరుందులు సైకతములు
గంధగజయానచరణముల్ కచ్ఛపములు | రమణిహారంబులెల్లను రమ్యమణులు
తరుణి ఘననాభి సుడియనఁ దనరుచుండుఁ | గావున విలాసజలరాశి యావెలంది.


వ.

ఇవ్విధంబున ననన్యసామాన్యయౌవనసౌందర్యసద్గుణకదంబయగు చల్లమాంబ
యు నఖిలగుణంబుల నప్పరమపతివ్రతారత్నంబున కెనయందగు మల్లికాదేవియుం ద
నకుఁ బ్రియపత్నులుగా నభీష్టభోగంబు లనుభవించుచుండి యారాజపురందరుం డొక్క
నాఁ డాత్మగతంబున నిట్లని వితర్కించె నంత.


చ.

సిరిగలవాఁడె మానవుఁ డశేషజగద్విదితంబు గాఁగ సు
స్థిరతరమైనకీర్తులను జెందుట మేలగు నట్టుగానిచో
సిరియును లేమియుం దలఁపఁ జీకటి వెన్నెలవాసి గాక యె
వ్వరికిని లేతప్రాయమును వార్థికమున్ గురిగాదె మేదినిన్.


గీ.

ధనము గల్గియుండ ధర్మంబు సేయక | యున్ననదియుఁ బరుల కొదవుఁ గాదె
తేటులెల్లఁ గూడి తేనియఁ గూర్చిన | నొరుల కబ్బినట్టు లెఱుఁగుకొనిన.


గీ.

చెలఁగు చౌశీతిలక్షల జీవరాసు | లవనిఁ జరియించి నరకంబు లనుభవించి
యంతమీదట మనుఁజుఁడై యవతరించి | తేటపడఁగ సమస్తంబు తెలిసియుండు.


ఉ.

అట్టిమనుష్యదేహ మటు లబ్బినయప్పుడె భక్తి మీరఁగా
గట్టులరేనియల్లుని జగద్విభు నీశ్వరు నిందుశేఖరుం
గట్టిగఁ బూజ సేయుచునుఁ గౌతుకలీలలఁ గీర్తికాంతఁ జే
పట్టి తుదిం దిరంబయిన భవ్యపదంబునుఁ జెంద మేలగున్.


క.

అడిగినవస్తువు లొరులకుఁ | గడు వేడ్కనొసంగి ముజ్జగంబులకుం దా
నొడయఁ డగునట్టి శంభునిఁ | దడయక హర్షింపఁజేతుఁదధ్యము మీరన్.


క.

ఈపథమున ప్రతికార్యముఁ గావింప దలంచుచోటు గావలయుఁ దగ
న్భావనతరగురుదీక్షను | ధీవరులగువారలకు నధికతరభక్తిన్.


క.

పొసఁగ గురుచరణయుగళము | వెసఁ గాంచినయపుడె తొలఁగు వెఱచి యఘంబుల్
విసవిసఁ బవనుఁడు జవమున | విసరిన విడిపాఱుజలదవిసరముభంగిన్.


మ.

వనజాతప్రభవాండమండితజగద్వ్యాకీర్ణుఁ డై యొప్పుభ
ర్గునిఁ గాంచన్ గురు నాశ్రయింపవలయుం గుంభాంతరాపూర్ణద
ధ్యనిశోద్యన్నవనీత మారయఁగఁ దథ్యం బొప్ప నెల్లప్పుడున్
ఘనమందారము నాశ్రయించుకరణిన్ గౌతూహలప్రక్రియన్.