పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్విలసితనామధేయమున వేమరుఁ జెల్వగునట్టిచంద్రస
మ్మిళితములై వసించుఁ జెలిమిన్ మనెనోయన నొప్పు నెప్పుడున్.


క.

విరిచెండ్లు నిమ్మపండ్లును | గర మొప్పగు పసిడిగిండ్లు కరికుంభములున్
సరిగా వావరవర్ణిని | గురుకుచయుగళంబుతోడ గోరంతైనన్.


క.

గళమునకు నోడి శంఖము | గళగళమనిపలుకుచుండెఁ గలకంఠంబుల్
పలుచందంబుల నయ్యు | గ్మలిసుస్వరమునకు నోడి మలినములయ్యెన్.


సీ.

వనజాక్షి కెమ్మోవి కెనఁబోల్పఁదగునవి పల్కదళాల్ గావె పల్లవములు
శుకవాణియధరంబునకు సాటియౌనంచుఁ గీర్తింప ఱాల్గావె కెంపులెల్ల
నెలనాగ పెదవితోఁ దులయంచుఁ బొగడంగ విలువ దేరునుగావె విద్రుమంబు
లింతివాతెఱతోడ నీడనంగను గంధరహితంబు నగుఁగాదె రక్తకంబు
నరయ నెందులతోఁ బ్రతియనఁగవచ్చు | బలుచనై తేనె లొలుకుచు విలువఁ దెగక
సతతఘనసారసౌరభోన్నతులఁ దనరు | కంబుకంధర రదనాంశుకంబునకును.


క.

తలతలమను వజ్రంబులఁ | దలతలమను నిందువదన దంతమరీచుల్
కలకలమనియెడు రాచిలు | కలకలమనుసుల్ గలంచుఁ గలికి మృదూక్తుల్.


ఉ.

తామరసాక్షి వీనుగవతానవ సంఖ్యల నెంచఁజాలుఁద
త్కామిని తళ్కుచెక్కు లల కామునిచేతిమెఱుంగుటద్దముల్
సామజయాన నాసికము సంపఁగిమొగ్గల నెగ్గులాడు నా
కోమలి లోచనంబులు చకోరగణంబుల నేలు నెంతయున్.


క.

వనితారత్నంబునకుం | గనుబొమ లందమున మీరు కందర్పునిచేఁ
దనరెడి సింగిణివిండ్లో | యనుచున్ జనులెల్లఁ జూచి యభినుతి చేయన్.


మ.

నెరి నబ్జాహ్వయ మిర్వురందు నలర న్నీరేజతారేశు లా
తరుణీరత్నము ముద్దునెమ్మొగము చందంబంద వాదించుచో
సరసీజావళి యోడెఁ గాదని యొరుల్ చర్చింప సర్వోర్వికిం
గర మాహ్లాదము చేయుచంద్రుఁ గని స్రుక్కన్ వాని క ట్లేటికిన్.


క.

నీలంబులమృదుతరశై | వాలంబులఁ జారు చమరవాలంబు లస
ద్రోలంబమేచకాంబుద | జాలంబుల నేలఁజాలు నఖచికురంబుల్.


సీ.

జలజాక్షి నునుకురుల్ శైవాలలతికలు రాజాస్యవళులు తరంగతతులు
కలకంఠి లోచనంబులు గండుమీనులు సుమగంధి విమలహాసములు నురువు
లతివకంఠము దక్షిణావర్తశంఖంబు భామచన్గుబ్బలు పర్వతములు