పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

రాజశేఖరచరిత్రము


గ్రాలన్ గోత్రధరాధరేంద్రములు వ్రీలన్ లీనమై వేడెముల్
దోలున్ ధేయని యక్షకిన్నరపురస్తోమంబు దూటాడఁగన్.

29


సీ.

ఒకవేళ సింహమై యుఱుకుచు బెదరించు
                       నొకవేళ హరిణమై యొద్ద నిలుచు
నొకవేళ భూజముల్ పెకలించు ఘోణియై
                       యొకవేళ శలభమై యుద్భవిల్లు
నొకవేళ మౌనియై యొయ్య నొయ్యన వచ్చు
                       నొకవేళ నగ్నియై యుఱక వెలుఁగు
నొకవేళ మేఘమై యుఱుముచు నేతెంచు
                       నొకవేళ శైలమై యుండు నడుమ


గీ.

నద్దురాత్మునిమాయ లే మనఁగఁగలదు
జపతపోనిష్ఠ లేమియు జరుగనీక
బదరికాశ్రమసీమ తాపసుల నెల్ల
నలఁచి యేచుచు నొక్కనాఁ డదను వేచి.

30


క.

నాచిన్నిముద్దుకూతురు
నాచక్కనితల్లి వీథి నడయాడఁగ న
న్నీచుకొనిపోయె సాళ్వము
రాచిలుకం గొంచుపోవుక్రమమునఁ దండ్రీ.

31


క.

ఆసవ యొయ్యన నెఱిఁగి మ
హాసుర వెనువెంటఁబోవ నదలించి గత
త్రాసుఁడయి చేతి కశగొని
వ్రేసెన్ నను నిట్లు రోషవివశుం డగుచున్.

32


క.

ఏడవ యేటిది యెవ్వరు
వేడుక కదలించిరేని వెక్కుచు నేడ్చున్
జూడ భయంకరయగు తన
చేడియ కుడిగంబు లెట్లు చేయు నృపాలా.

33