పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

27


క.

అత్త దయామతిఁ దనకడ
నత్తమిలక నిద్రవోవ దహరహమందున్
బొత్తునఁ గుడువత తాఁగడి
యెత్తదు తజ్జనని యింత కేమయ్యెనొకో.

34


సీ.

కడుపార దొండపం డిడి ముద్దుగఱపిన
                       రాచిల్కకొదమలఁ జూచి చూచి
పాదులలో నిండ బా ల్పోసి పెంచిన
                       చూతపోతంబులఁ జూచి చూచి
తోడికన్నెలుఁ దాను గూడిమాడి చరించు
                       సురపొన్ననీడలఁ జూచి చూచి
బృందావనంబులు పెంచి తిన్నెలమీఁద
                       సూటిఁ బెట్టినమ్రుగ్గు చూచి చూచి


గీ.

సంతసంబున దేవపూజలు ఘటించి
పారికాంక్షులసేవకై పరమనియతి
లీల నడయాడుచున్న బాలికలఁ జూచి
హృదయవీధిక నెట్లు భరించువాడ.

35


ఉ.

ఇంకిట మాట లేమిటికి నింతకు నా తనయాలలామ మే
ణాంకనిభాస్య యెందుఁబడి బొందెనొ యెంత గుందెనో
శంకరసత్కృపారసవశంబున గాంచినయట్టి యీనిరా
తంకునిఁ బంపి నామనసు తల్లడ మార్పఁగదే నృపాగ్రణీ.

36


వ.

అని యిట్లు పలుకుచున్న మునిపలుకుల కులికి నృపాలుం డాత్మ
గతంబున.

37


ఉ.

కానకగన్న వీని నెటుగాఁ గుటిలాసుర మీఁది కోటికిన్
గాననసీమ కంపు దటు గాక దురంతవిషాదవేదనా
ధీనత యీమహాత్మునకుఁ దీర్పక యేగతి నుండఁగాఁదగున్
దీనికి నెద్ది కార్యమని నివ్వెఱఁ గంద నతండు క్రమ్మఱన్.

38