పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

రాజవాహనవిజయము

14. తృష్ణార్తుఁడు = దప్పిగొన్నవాఁడు. ఖరకిరణఖిన్నుఁడు = సూర్యునివలన శ్రమనొందినవాఁడు.

క.

ఆ నలినాక్షికి వేనలి
చే నలి రుచిఁ గెలువఁ జాలు చెలువకు వలువల్
చే నిచ్చి వెనుక వచ్చిన
మానిని కుడగరలు కొన్ని మన్నించి తగన్.

15

15. అలిరుచి = తుమ్మెదలయొక్క కాంతి, ఉడగరలు = సొమ్ములు.

క.

తానం బాడి మనీషివి
తానంబున కర్థ మిచ్చి తానంతట సం
తానం బనఁదగి మగసం
తానంబున నతఁడు ముదముతానం బయ్యెన్.

16

16. తానము = స్నానశబ్దతద్భవము. మనీషివితానము = పండితసమూహము. సంతానము = కల్పవృక్షము. ముదముతానము = సంతోషస్థానము.

గీ.

పురుడు పరిపాలితాలకాపురుఁడు, శేష
భుజగనూపురుఁడును గాక పుడమిఁ గలఁడె
యనఁగ సిరిగన్న రాజన్యతనయమణికి
హర్ష మందిరి యంతఃపురాబ్జముఖులు.

17

17. పురుడు = సమానము. పరితాలకాపురుడు = పరిపాలించఁబడిన అలకాపట్టణముగలవాడు అనగాఁ గుబేరుడు, శేషభుజగనూపురుఁడు = శివుడు.

క.

ధరణీశుఁడు బుధమణిగణ
వరశరణం బపుడు రాజవాహనసంజ్ఞా
భరణుఁడని బాంధవాంతః
కరణంబు ఫలింప నామకరణం బిడియెన్.

18