పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

23

37. ఎటువంటిదో, తలఁపుకెంపు = చింతామణి, వినువాఁక = ఆకాశప్రవాహము. ఆసేతుకాశి = సేతువు మొదలుకొని కాశిపర్యంతము. తైర్థికులు = తీర్థయాత్ర చేయువారు.

సీ.

కొడుకు మన్మథుఁ డాఁడుఁబడుచు భాగీరథి
                 యిల్లాలు భూకాంత యిల్లు కొండ
యన్న దా బలభద్రుఁ డగ్రసూనుఁడు బ్రహ్మ
                 కోడలు శారద కొలములోన
మఱఁది కల్వలఱేఁడు మామ సముద్రుండు
                 మఱియును రెండవమామ భోజుఁ
డలరు పేరెద సొమ్ము వెలలేని మాణిక్య
                 మచ్చబంగారుపై పచ్చడంబు


గీ.

నన్నవెచ్చంబు ముక్కంటి కెన్న నరిది
జగము లీరేడు గర్భవాసమున నిముడు
సిరి యొడయఁ డెంత సంసారి శేషశైల
వల్లభుని వంటి దాత దైవంబు గలఁడె.

38

38. కొడుకు మన్మథుఁడు = ఈ పద్యమునందు వెంకటేశ్వరుని పుత్తకళత్రమిత్రాదిసమృద్ధి వివరింపఁబడుచున్నది. శారద = సరస్వతి = శరదృతువు నందుఁబూజింపఁబడునది. పేరెద = విశాలవక్షము. అచ్చ = స్వచ్ఛమైన, అన్నవెచ్చము = భిక్షాప్రదానము. (మాధుకరము) ఈరేడు = చతుర్దశ.(ఇఱుఏడు) పదునాలుగు

షష్ఠ్యంతములు

క.

ఏవం విధ గుణనిధికిన్
ధావన్నిధనాశ ధామధామ దవీయో
దేవానాంప్రియ దానవ
భావానా ద్యప్రమోదపాధోనిధికిన్.

39