పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

113


గీ.

జగతి గెలుపులచే కొనుచామరమ్ము
లధికసత్వంబులుండ నియ్యడవి వింటి
కేటికని చామరమ్ముల నెల్లగొనిరి
చమరులనుఁ జేరి శూరులు చెమరుబలిమి.

33


శా.

దానప్రౌఢిమ నెంచి చూచినను భూదారత్వసంరూఢిచే
యేనాటం దమి నేమిటం గొదవయే మీయమ్ము లాయమ్ములన్
క్ష్మానాథుం డిటు లేయనేటి కనుగిన్కం గోలె కోలంబు లౌ
రానించెన్ ప్రతిగాగ రక్తశరధారాసారముల్ మీఱఁగన్.

34


మ.

వడిగా వెన్నున నిల్వనేసిన శరవ్రాతంబు నిండార నల్
గడలన్ మిన్నులురాయు కీచకశిఖాకాండప్రకాండంబుగా
పుడమిం జాఱెడు క్రొత్తనెత్తురులరొంపుల్ ధాతుపూరంబుగా
నడగొండల్ వలె నుండె వన్యగజసంతానంబు లంతంతటన్.

35


సీ.

ముంచి యెత్తిన రొంపి ముకుగోళ్లఁ జిందెనా
                 గగనగంగకుఁ బంకగరిమఁ జూప
చింతనిప్పులు రాలు చిఱుతకన్నులడాలు
                 దావకీలలకునుఁ గైదండ లొసఁగ
ఝాడించి నిలిచిన స్తబ్ధరోమములచే
                 బ్రహ్మాండములు తూంట్లబావలుగను
ఘుర్ఘురస్వనముల గుంభినీధరముల
                 గుహలసింగంబుల గుండె లవియ


గీ.

వలల చించుక చెంచులవశముగాక
యేకలం బొక్కఁ డుర్వీశు నెదుట నపుడు
ప్రళయకాలవరాహంబు పగిది హెచ్చ
వచ్చినిలిచెను ప్రజలెల్ల విచ్చిపాఱ.

36