పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

శ్రీరాజగోపాలవిలాసము


క.

వారిద్దఱి తపములకును
వారిజనాభుండు మెచ్చె వరమును దయచే
కోరఁగ నొసంగి మగుడన్
జేరెను వైకుంఠపురము చిత్త మెలర్పన్.

20


గీ.

దక్షిణద్వారకాపురస్థలము మహిమ
శౌనకమహర్షికిని సూతసంయమీంద్రుఁ
డంతయునుఁ దెల్పియచ్చట నతిశయిల్లు
నలహరిద్రానదినిఁ జాల యభినుతించి.

21


చ.

ఇలఁగల పాపసంఘముల కెందును నిష్కృతిఁ గల్గుగాని మేల్
దలఁపని పాపకర్ముని కృతఘ్నతకున్ మఱిలేవు నిష్కృతుల్
తొలుతఁ దొలంగినట్టి ఘనదోషము నొక్కదరాధినేతకున్
కల దితిహాస మొక్కటి ప్రకాశము సేసెద మీకు నెంతయున్.

22


గీ.

ఒనరు గోదావరీనది యుత్తరమున
సింధుసౌవ్వీరమధ్య ప్రసిద్ధ మగుచు
తేజమున మించి సౌరాష్ట్రదేశమందు
పుణ్యవర్తనుఁ డొకమహీభుజుఁడు గలఁడు.

23


సీ.

తనదు దుర్గాధిపత్యము లోకముననున్న
                 జననాథుల కలంఘ్యశక్తిఁ దెలుప
తనదు సర్వజ్ఞత్వ మనిశంబు జనముల
                 మనములలోనున్న మర్మ మరయ
తనయుగ్రభావంబు దర్పితాహితవాస
                 పురముల నొక్కట పొడవడంప
తనమహైశ్వర్యంబు తప్పకఁ గొల్చిన
                 ధన్యులకును ధనదత్వ మెసఁగ