పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

శ్రీరాజగోపాలవిలాసము


గీ.

యనుదినంబును సహజకృత్యంబు గాఁగ
మేలుమేలని జగమెల్ల మెచ్చిపొగడ
బ్రహ్మవిద్యావిదుండు గోప్రళయమౌని
తపము గావించె శ్రీహరిఁ దలఁచి భక్తి.

8


మ.

బలునిష్ఠన్ మధువాసరాత్యయములన్ పంచాగ్నిమధ్యంబునన్
వలిగాడ్పుల్ నిగుడంగ బట్టబయిటన్ వర్ష ప్రకర్షంబునన్
పులకల్ జాదుకొనంగ శీతువున సంపూర్ణోదవాసంబునన్
చలనం బందక సల్పె నుగ్రతప ముత్సాహంబు సంధిల్లగన్.

9


క.

నిరుపమనిష్ఠానిధి యగు
పరముమునీంద్రుని తపఃప్రభావము మదిలోఁ
బరికించి పంకజాక్షుఁడు
కరుణకు పాత్రంబు సేయఁ గౌతూహలియై.

10


సీ.

గరుడిఱెక్కలగముల్ గగనసౌధమునకు
                 కనకంబు వ్రాయువాఁగరులు గాఁగ
పసిఁడిచేలచెఱంగు బర్హిబర్హంబను
                 మేఘంబునకుఁ గారుమెఱుఁగుఁ గాఁగ
కరుణాప్రవాహంబు కన్నుదమ్ములకును
                 పసిమించు మకరందరసము గాఁగ
మొలకనవ్వులు లచ్చిమోము జూబిల్లిపై
                 నెలకొన్న చిన్నివెన్నెలలు గాగ


గీ.

గరుడగంధర్వగాయనీగాన మమర
నమరనాయకు లిరువంకలందుఁ గొలువ
విలువలేనట్టి శృంగారవిభవ మెసఁగ
నంబుజాక్షుండు మునికిఁ బ్రత్యక్షమయ్యె.

11