పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

107


మ.

ఘననిష్ఠం దపమాచరించు మునిలోకశ్రేష్ఠుఁ డవ్వేళఁ దా
కనుదమ్ముల్ వికసిల్లు చెంగటను సాక్షాత్కారముం జెందు న
వ్వనజాక్షున్ భువనైకరక్షకుని దుర్వారప్రభావోన్నతుం
గనియెన్ పెన్నిధిఁగన్నపేదగతి నుత్కంఠాతిరేకంబునన్.

12


సీ.

బ్రహ్మాండభాండముల్ బంతులుగామాటి
                 కలదు లే దనునట్టి ఘనుఁడ వీవ
పదునాల్గుజగములు భరియించి జలధుల
                 విహృతి సల్పిన మహామహుఁడ వీవ
పొక్కిలి విరిదమ్మి భువనముల్ నిర్మించు
                 బుడుతని గన్నట్టి ప్రోఢ వీవ
పదిరూపములు పూని పదిలంబుగా భూమి
                 కరుణఁ గాచిన జగత్కర్త వీవ


గీ.

మూఁడుమూర్తులు మెలఁగెడు మూర్తి వీవ
వేదవేదాంతముల నిన్ను వెదకి వెదకి
కానకున్నట్టిపట్ల నీఘనత లెల్ల
వల్లవీజార! కొనియాడవశమె మాకు?

13


గీ.

వినతి గావించి యీరీతి వినుతి సేయు
మౌనిచంద్రునిఁ గనుగొని మాధవుండు
మించు నీ నిష్ఠకునుఁ జాల మెచ్చినాఁడ
నడుగు మాశాస్యమయ్యది యనిన నతఁడు.

14


ఉ.

వారిజనాభ! నీవు మును ద్వారకలోపల గోపగోపికా
వారము రుక్మిణీప్రముఖవారిజనేత్రలు సేవ సేయఁగా
వారిధితీరశైలవనవాటికలన్ విహరించునట్టి యా
మేరలు చంపకాటవిసమీపమునన్ మెఱయింపు మింపుగన్.

15