పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

శ్రీరాజగోపాలవిలాసము


క.

కలఁగన్న మేలుకొన్నను
కళవళముననైన వాని గాంచియు మఱియున్
పలుమరు కనుగొనఁ గోరెద
మెలతరొ! మరి యాస కెందు మేరలు గలవే?

67


మ.

పదియార్వన్నెపసిండికి న్మెఱుఁగురాఁ బై జాదుఁగావించు న
ట్లెదపై కుంకుమమీఁద హేమరసనాహీనప్రభల్ బర్వఁగా
మదనాగేంద్రములీల వచ్చు విభుమర్మంబుల్ విలోకించినన్
మదనావేశముతోడ నెవ్వతె కళామర్మంబు లూటాడవే?

68


సీ.

మొగము చూడక మారుమొగము పెట్టుదమన్న
                 నతనిఁ గ్రమ్మరఁజూడ నాసయగను
చెలులతో నేమైనఁ బలుకఁబోయెదనన్న
                 నతనిపేరే మాటలందు దొరలు
నలుక యాయనమీఁద నిలిపెదనన్ననుఁ
                 బ్రమదంబు తనుదానె పల్లవించు
తలఁపులో నాతనిఁ దలఁపకుండెదనన్న
                 నతనిమీఁదిదె బాళి యగుచునుండు


గీ.

నతనిపై నేరముల నెన్నునట్టివేళ
నతనిసద్గుణగణములే యాత్మఁదోచు
మమత లిటువంటి వతనికి మరులుకొంటి
తామసించిన యింక నే దాళంజాల!

69


గీ.

ఎన్నివిధములఁ బలికిన నెఱుఁగనైతి
వింత నామేనిసంతాప మింత మేన
ననుచు చెలి దూరి వలవంత నాసుదంత
కంతుమందానిలేందులఁ గనలి పలికె.

70