పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

79


చ.

ఫలకమునందు వ్రాసి తమప్రాణవిభుం బలుమారు వేడుచున్
బలపల వేగునంతకు నపారవియోగభరార్తలైన యా
నెలఁతలచెంత నవ్విభుఁడె నెమ్మది సమ్మదమంద నిల్చినన్
లలనరొ! వారివేడుక కొలంకులు నిండి తొలంకకుండునే?

64


మ.

వెలలేనట్టి పదాంగదంబు చెలఁగన్ వింతల్ భళీ! మేలనం
దళుకున్ వట్రువ గొప్పముత్తియపుటందం బొప్పు బాహాంగదం
బులు రాణింపఁగ ముత్తెపున్ సరపణుల్ ముంజేతులన్ మించఁగా
సొలవుల్ మీఱఁగ వాఁడు వచ్చి కనుమెచ్చుల్ సేయఁ డేమందునే?

65


సీ.

ఏలలువాడుచో నిపుడేటికో? చంద
                 మామమీఁది పదాలు మానినార
లధికంబుగాఁగూర్చి రదియేమొ? పన్నీరుఁ
                 గర్పూరమునుఁ జల్వగంధమునను
సన్న జాదు లిదేమొ యిన్నాళ్లవలెగాదు
                 పాన్పుపైఁ దఱచుగాఁ బఱచినారు
చేఁబూనుటయెకాక చెలువలు నేఁడేమొ
                 కీరశారికులఁ బల్కించలేదు


గీ.

వెలి విసరినటు లున్న దీవిరహచిహ్న
మింతి! నీచెంత కాయన యిపుడె వచ్చు
ననెడు నీమాటలకుఁ జాల నలరియుంటి
నింతతామస మౌట యే నెఱుఁగ నకట!

66