పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

శ్రీరాజగోపాలవిలాసము


గీ.

చక్కదనమున శౌరికి సాటి లేరె
యించువిలుకానిఁ బోల్చి వర్ణించనెంచు
నెంచుఁ దమలోన నేరంబు లెంచుకొనుచుఁ
జెలులు శిశిరోపచారముల్ సేసి రెలమి.

60


ఆ.

రాజగోపుఁ డిచట రాజాస్య యచ్చట
నెటులఁ గలుగు కూట మిరువురకును?
వనితపాల గలిగి వలరాచవేలుపు
కన్నుఁ దెఱచెనేని గల్గు శుభము.

61


సీ.

కందుకుందును లేని కలువలచెలికాఁడు
                 గలిగిన చెలిమేనికాఁక దీఱు
నిత్యవికాసంబు నెగడుతమ్ములు సంభ
                 వించిన చెలిమేనివేఁడి దీఱు
పగలురే లొకరీతిఁ బరగువెన్నలతేట
                 చేకూర చెలిమేనిసెకలు దీఱు
ననిశమార్దవమున నలరెడు తలిరాకు
                 లొదవినం జెలిమేనియుడుకు దీఱు


గీ.

ననినఁ జెలులార! యిట్టివి యందు జగతి
నతనిసమ్ముఖ మతనిహస్తావలంబ
మతనిదరహాస మాతనియంఘ్రిసేవ
గలిగినప్పుడె యివియెల్ఁ గలుగుఁ జెలికి.

62


క.

అని పలుకుచెలులఁ గనుగొని
కనుగొనలన్ వేఁడితేటకన్నీ రొలుకన్
వనజానన యి ట్లనియెను
మనమున సంతాపభరము మల్లడిగొనఁగన్.

63