పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

65


శా.

చింతాసంతతిఁ జిక్కి చెక్కిటిపయిం జేఁ జేర్చి చింతింప నీ
ప్రాంతారామనికుంజపుంజములచాయ న్నిల్చి వామాక్షి! నీ
కాంతుం దెచ్చెదనంచు వేవుదనకున్ గాసింబడంజేసితే!
కాంతా! యాప్తులు సేయుమాయలకు లోఁగాకుండువా రెవ్వరే?

6


క.

తగవులు తెగువలు బిగువులు
నగవులు పైపూఁతవలపు నయగారములున్
మగువా! యీవగ లెల్లను
మగవానికిఁ జెల్లుఁగాక మగువకుఁ దగునే?

7


ఉ.

తల్లడ మేల? నీవరునఁ దప్పనటంచు ననేకనాయికా
వల్లభుఁ డాడుమాట నెఱవంచన యంచు దలంచనైతినో
హల్లకపాణి! యీవికచహల్లకజాతపరాగజాతముల్
చల్లనిమేనిపై సెకలుచల్లఁగ నేగతి తాళనేర్తునే?

8


ఉ.

ఎన్నఁడు సమ్మతించు నిఁక నెన్నఁడు నన్ దయమీఱఁ జూచు నిం
కెన్నడు మాటలాడు నిఁక నెన్నఁడు కౌఁగిట గారవించు నిం
కెన్నడు పుణ్య మెల్ల ఫలియించునొ? యంచుఁ దలంచునాథుఁడే
నన్నిటు చౌక సేసినను నాతిరొ! యేగతి నోర్వవచ్చునే.

9


చ.

అంచలనంచలుండ మలయానిలముల్ మలయంగ చెంగటన్
పంచమవైఖరుల్ తరులపంచఁ బ్రపంచము సేయఁ గోరుటల్
పొంచి మరుండు నన్ను సురపొన్నలకోరికి సూటి సేయఁగా
వంచన లిట్లు సేయదగవా? పగవారికినైన నక్కటా!

10