పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

శ్రీరాజగోపాలవిలాసము


సీ.

చెక్కున మకరికల్ చికిలిగోరున వ్రాయు
                 నపుడు నాతోడ నేమనియె మున్ను?
మేడచేరువకుఁ దా మెల్లమెల్లన వచ్చి
                 నను సన్న సేసి యేమనియె నాఁడు?
నిచ్చవెన్నెల గాయ ముచ్చటలాడుచు
                 నతిరహస్యముగ నేమనియె మొన్న?
నెలదోఁటలోన రేయెల్లను విహరించి
                 యకట! వేకువనె నేమనియె నిన్న?


గీ.

పలికి బొంకనివాఁడంచుఁ బలుక దెపుడు
నింతలో వింత లోయింతి! యేమి పుట్టె?
నౌర! యామోహనాకారుఁ డాచరించు
మాయ లిటువంటి వందుకే మాయ నిపుడు.

11


క.

మగవారికిఁ గలగుణముల
మగువల వలపించుదనుక మమకారంబుల్
మగువలు వలచినపిమ్మటఁ
దగవులు మతి వేఱె కావె తామరసాక్షీ!

12


క.

కలలోన నైన నెన్నఁడు
పలుకులు జవదాటకుండు పతికిన్ సతికిన్
కలిగెను సిలుగని సవతులు
కలకలనవ్వంగఁ దాళగలనా! లలనా!

13


సీ.

ఎంత నేరము చేసి యేనియు నాచెంత
                 నిలిచినఁగోపంబు నిలుపనేర
చూపులలో వింతసొగసులు చిగురించఁ
                 జూచిన వెగటుగాఁ జూడనేర