పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శ్రీరాజగోపాలవిలాసము

తృతీయాశ్వాసము

శ్రీకలితదానతోషిత
లోకాలోకాంతరస్థలోకాలోక
వ్యాకోచోత్పలరేఖా
రాకేందుసరూప! విజయరాఘవభూపా!

1


గీ.

అవధరింపుము! సూతసంయమివరుండు
శౌనకునితోడ నిట్లను శౌరి యట్ల
భద్ర లక్షణఁ దేలించి ప్రమదమునను
మఱియు గరితలపై చాల మమత యుంచి.

2

విప్రలబ్ధ - జాంబవతి

క.

అంతట నాజాంబవతీ
కాంతారత్నంబు దూలికామణితో నే
కాంతంబునం బలికెడు నల
వింతల నొకకొన్ని వినెడువేడుకతోడన్.

3


చ.

పలచఁగఁ బూసినట్టి కలపంబునఁ బుట్టిన వింతవాసనల్
కొలనికెలంకు పూఁబొదలకున్ నెఱతావుల సొంపునింపఁ బై
వలిపెపుదుప్పటీచెఱఁగు వల్లెడ వైచి యదూద్వహుండు దా
సొలపున మాపి లేఁజిగురుజొంపపుసందులఁ జూచుచుండగన్.

4


క.

కలకంఠకంఠి యచ్చట
చెలువుని వంచనకుఁ దనదు చిత్తములోనం
గలఁగుచు మరుబాములచే
నలమటఁ బడి దూతితోడ నపు డిట్లనియెన్.

5