పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

శ్రీరాజగోపాలవిలాసము


సీ.

వీరినిగ్గు వెలిఁజిమ్ము వింతయోర రుమాలు
                 మీఁద ముత్తెపుతురా యించుమించ
మెఱుఁగుఁజామనచాయమేనిపై నెత్తావు
                 లడరఁ గుంకుమగంద వొడియలంది
జూరికట్టినయట్టి సరిగె దుప్పటికొంగు
                 వామాంసమున వల్లెవాటు వైచి
పైగోవకెంపురాపలకచెక్కడముల
                 వెలహెచ్చుకడియమ్ము లలవరించి


గీ.

వజ్రమాణిక్యమయబహువలయరుచులు
రహి వహింపంగ తారహారములు పూని
మురువుచెవిచెంత నొకవింతమురుపు చూప
మేఘవర్ణుండు చెలియున్నమేడ చేరి.

57


శా.

లీలామందిరశిల్పకల్పకలనాళీలోక మాలోకన
శ్రీలాలిత్యము మీఱ సత్వరముగాఁ జెంతం జరింపన్ సరః
కేళీహంసము లాత్మనూపురరవాకృష్ణంబులై క్రుమ్మరన్
నాళీకేక్షణవిభ్రమోచితవిధానైపథ్యముల్ మీఱఁగన్.

58


క.

తనరాక కెదురుచూచుచు
కనుఁగవ దరహాసచంద్రికలం బైఁజిలుకన్
గనుఁగొని యప్పుడు హరియును
మనసిజసంచాల్యమానమానసుఁ డగుచున్.

59


గీ.

చకితసారంగలోచనసరస కరిగి
వెలయ భవనాత్మశృంగారవిభవములను
మేలుమేలునఁ దనమీఁది మేలుఁ దెలుపు
నిందుబింబాస్యతోడఁ దా నిట్టు లనియె.

60