పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

57


చ.

కెలఁకున జిత్రమందును లిఖించిన నీప్రతిబింబ మందమై
నెలకొని నిల్వుటద్ద మొకనెచ్చెలి దేరఁగఁజూచి దవ్వునం
జెలువుఁడు వచ్చెనంచుఁ గయిసేయుచునుండి విభూషణావళుల్
నెలవులు దప్పఁబూను రమణీమణి తత్తర మేమి చెప్పఁగన్.

53


చ.

తలిరులు వాతెఱన్ విరులదండలు చూపుల నాణిముత్తెముల్
పలువరుసన్ సరోజములు పాదయుగంబున మించుటద్దముల్
తళుకుమెఱుంగుఁ జెక్కులనుఁ దా సవరింపుచు నీదురాకకై
కలికి ప్రసాధికామణుల కన్న నలంకృతిఁ గూర్చె మేడకున్.

54


సీ.

మొగము సోయగముచేఁ బగటువో మీటిన
                 యలనాఁటి పగదీర్తు ననియె విధుఁడు
కులుకుఁబల్కులచేత నలుక పుట్టించిన
                 యలనాఁటి పగదీర్తు ననియెఁ జిల్క
ముద్దునెన్నెడలచే గద్దించి కదిమిన
                 యలనాఁటి పగదీర్తు ననియె నంచ
నెఱిగొప్పుకప్పుచే నెఱదప్ప దరమిన
                 యలనాఁటి పగదీర్తు ననియెఁ దేఁటి


గీ.

ఏల యొకమాట మాటఁగ నించువిలుతుఁ
డెపుడు సెలవనునని మది నెంచియున్న
యతని బలగంబునెల్ల నిట్టట్టు సేసి
రామ నేలర యేలరా రాజసములు.

55


గీ.

అనుచుఁ బలికెడు దూతితో ననియె విభుఁడు
సారసారెకు నిట్టులో సారసాక్షి!
ఇంత దెలుపంగ వలయునే! యింతికొఱకు
నిపుడె వచ్చెదఁ జనుమని యెసక మెసఁగ.

56