పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

49


గీ.

విరహిజనములపై వేఁట వెడలు మరుని
జిగురుఁగండెలు కాఁబోలు చెలువచూపు
లందు గట్టిగ నంటిన యట్టి నాదు
మనసు మరలక యున్న దేమనఁగ నేర్తు?

22


సీ.

వలకారిచూపులు దెలిపెను భావంబు
                 కలికి యేమోకాని పలుకదయ్యె?
నిఱుకుగుబ్బలచాయ లెదురుకోలు ఘటించె
                 పడఁతి యేమో యోరపాటు సేసె?
ముసిముసినగవు సొంపులు సేదఁ దేర్చెను
                 వెలఁది యేమిటికినో వెతలఁ బెట్టె?
ననురాగమంతయు గనుపించె వాతెఱ
                 తెఱవ యేమో సమ్మతించదయ్యె?


గీ.

నేమి యనవచ్చు నక్కటా! మామకీన
సమసమయజాతభావనాసాహచర్య
కందళన్మోహసన్నాహఘనఘనాఘ
నాంతవిద్యున్నిశాంతంబు లింతి సటలు.

23


గీ.

కలువ విరిదండ సారించు కరణినున్న
నున్నతామోదమునఁ దేలియుంటి గాని
బాలచూపుల వెంటనే వాలుదూపు
లించువిలుకాఁడు సంధించి యేయు టెఱుఁగ?

24


గీ.

ఎపుడు వచ్చునొ యిచట కయ్యిందువదన
ఇంత తామసమౌటకు హేతువెద్ది?
ఏయుపాయంబుచేత నీరేయి గడచు
ననుచు జింతింపుచున్నట్టి యవసరమున.

25