పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

శ్రీరాజగోపాలవిలాసము


గీ.

నిలిచి, మదిలోన నేమేమొ తలంచు, తలఁచి,
యెచట కేఁగెద నిపుడని యెంచు, నెంచి
బలిమిఁ దనుఁదానె యొకకొంత తెలియుఁ దెలిసి
చింతతోడుత నెలఁదోఁట చేరి యందు.

17


చ.

మలయతటీపటీరతరుమాంసలసౌరభభారమందసం
చలనసమీరలోలజలజాతసుజాతపరాగరాగసం
కలితమనోహరాస్తరణకాంతనిశాకరశాంతవేదికా
తలముననుండి యవ్వికచతామరసాక్షిఁ దలంచి నెమ్మదిన్.

18


ఉ.

కమ్మనియూర్పులౌ సురటిగాడ్పులచే మకరాంకకేళి మైఁ
గ్రమ్మిన ఘర్మవారికణికల్ హరియింపుచు సేదదీఱఁగా
ఘమ్మనుమోవిపానకము గ్రమ్మర నిచ్చి పునారతిక్రియన్
సమ్మద మందఁజేయు నలసారసలోచనఁ గూడు టెన్నఁడో?

19


మ.

కలయం గ్రుమ్ముడి వీడి జాఱెడుకురుల్ గాటంపుపెన్మబ్బుగా
వలపుల్ గ్రమ్మఁగ రాలుపూలు కరకవ్రాతంబులై నిండ, మైఁ
బులకల్ పుట్టఁగఁ జేయు నూర్పువలిగాడ్పుల్ మించ నింకెన్నఁడో
కలకంఠీమణి పంచసాయకనిదాఘంబుం దొలంగించుటల్.

20


ఉ.

వెన్నెలఁగాయ నాయురము వీపునఁ జేరఁగ నొత్తగిల్లి తాఁ
జన్నుల తంబురా నిలిపి చల్లఁగ నాపయి పంతువాడుచున్
తిన్నఁగ నర్థముల్ తెలుపు తీరున మర్మముసోఁక పాడిక్రే
కన్నుల నవ్వునట్టి కలకంఠినిఁ గౌఁగిఁటఁ జేర్చు టెన్నఁడో?

21