Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టీక. లోకత్రాణరతిన్ - లోక = జనులయొక్క, త్రాణ = ప్రోపునందుఁ గల, రతిన్ = ఆశచేత - ఇది వాల్మీకివ్యాసులయం దన్వయము, తత్ = అట్టి, ఆదిమ = తొలుతటి దైన - ఇది ప్రవేశమునకు విశేషణము, మహీలోక = భూలోకముఁ గూర్చి, ప్రవేశ = చొచ్చుటయందు, ఉత్క = ఉత్సాహము గల, భాషా = సరస్వతీదేవిచేత, కౢప్త = తొడుగఁబడినవియై, ప్రథమద్వితీయ = కుడియెడమ లయిన, పద = పాదములయందు, గుంజత్ = అవ్యక్తముగ మ్రోయుచున్న, మంజు = విన నింపైన, మంజీర = అందెలయొక్క, గర్జాకల్ప = రొదతో సమానము లయిన, అమల = స్వచ్ఛము లయిన, రామ = రామునియొక్క, భారత = భరతవంశపురాజులయొక్కయు, కథా = చరిత్రములయొక్క - అనఁగా రామాయణభారతము లనుట, సర్గంబులన్ = నిర్మాణములచేత, మించు = పేర్చునట్టి, వాల్మీకివ్యాసులన్ = వాల్మీకిముని వ్యాసమునులను, తదుభయ = ఆరామాయణభారతముల రెంటియొక్క, శ్లేషార్థ = కూడిక యగునర్థముయొక్క, సంసిద్ధికిన్ = నెరవేరుటకొఱకు, కొలిచెదన్ = సేవించెదను.

ఉ.

ఏయెడ నర్థగౌరవసమృద్ధియు శబ్దవిశుద్ధియుం దిరం
బై యనవద్యతం బరఁగ నంధ్రవచస్స్థితి భారతంబు రా
మాయణము రచించిన మహాతుల నాత్మ్యఁ దలంచెదన్ జగ
ద్గేయుల నన్నపార్యునినిఁ దిక్కసుధీమణి నెఱ్ఱసత్కవిన్.

4

టీక. ఏయెడ = ఎల్లెడలను, అర్థ = వాచ్యాద్యర్థములయొక్క, గౌరవసమృద్ధియున్ = గురుత్వాతిశయమును, శబ్ద = పదములయొక్క, విశుద్దియున్ = సౌష్ఠవమును, తిరంబై = స్థిరమై, అనవద్యతన్ = నిర్దుష్ట మగుటచేత, పరఁగన్ = ఒప్పునట్లుగా, ఆంధ్రవచః = తెనుఁగుపదములయొక్క, స్థితిన్ = ఉనికిచేత - అనఁగాఁ దెనుఁగు ననుట, భారతంబు = భారతంబును, రామాయణమున్ = రామాయణమును, రచించిన = ఒనర్చిన, మహాత్ములన్ = పూజ్యులయిన, జగద్గేయులన్ = లోకస్తుత్యు లయిన, నన్నపార్యునిన్ = నన్నయభట్టారకుని, తిక్కసుధీమణిన్ = తిక్కనకవిని, ఎఱ్ఱసత్కవిన్ = ఎఱ్ఱాప్రెగ్గడను (ఈ మువ్వురిని), ఆత్మన్ = హృదయమునందు, తలంచెదన్ = భావించెదను.

క.

ఈవిధి నభీష్టసిద్ధికి, దైవతకవి నుతి యొనర్చి తప్పొప్పు మదిన్
భావించి దిద్దకుండను, దేవానాంప్రియుల మ్రొక్కి తెలతుఁ గుకవులన్.

5

టీక. ఈవిధిన్ = ఈ క్రమమున, అభీష్టసిద్ధికిన్ = కోర్కి నెఱవేఱుటకు, దైవత = దేవకలయొక్కయు, కవి = కవీశ్వరులయొక్కయు, నుతి = స్తోత్రమును, ఒనర్చి = కావించి, తప్పు = దోషమును, ఒప్పు = గుణమును, మదిన్ = తమహృదయములందు, భావించి = ఎంచి, దిద్దకుండ = సరిపఱుపకుండునట్లు, దేవానాంప్రియులన్ = మూర్ఖులకు,