Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ్రొక్కి = నమస్కరించి, కుకవులన్ = దుష్కవులకు, తెలతున్ = నమస్కారము చేయుదును. “దేవానాం ప్రియ ఇతి చ మూర్ఖ” అని వ్యాకరణము.

వ.

అని కుకవు లొకనిమిత్తంబునం బ్రార్థనీయు లగుటం జేసి తత్ప్రార్థనం
బునుం గొంత నడపినవాఁడనై యెద్దియేనియు నొక్కభవ్యకావ్యంబు
నవ్యప్రకారంబున రచియించుటకు నుదంచితకుతూహలుండ నై
యుండు సమయంబున.

6

టీక. అని = ఇట్లని, కుకవులు = కుత్సితకవులు, ఒకనిమిత్తంబునన్ = ఒకకారణముచేత, ప్రార్థనీయు లగుటం జేసి = కొనియాడఁదగినవా రగుటచేత, తత్ = ఆకుకవులయొక్క, ప్రార్థనంబును = వేఁడికోలును, కొంత = కొంచెము, నడపినవాఁడ నై = ప్రవర్తినఁజేసినవాఁడ నై, ఎద్దియేనియున్ = దేని నైన, ఒకభవ్యకావ్యంబు = ఒకమనోజ్ఞ మైనప్రబంధమును, నవ్యప్రకారంబునన్ = వింతతెఱంగున, రచియించుటకు = ఒనర్చుటకు, ఉదంచితకుతూహలుండ నై = సోత్సుకుండ నై, ఉండుసమయంబునన్ = ఉన్నవేళ.

ఈమీఁద నొకటిరెండు పద్యములు విడఁబడి యవి ప్రత్యంతరములయందుఁ గానఁబడమిచే నిటఁ జేర్పఁబడిన వయ్యెఁ గాని దానఁ గథాసందర్భము తప్పినది కాదు.

సీ.

ఏమహీవరుతాత యిమ్మభూవరుఁడు స
             త్కీర్తిగంగాజన్మకృతిమహాద్రి
యేవిభుతండ్రి నానావిధపౌరుష
             స్థిరవృత్తి మీసాలతిమ్మశౌరి
యేనృపోత్తముతల్లి మానితపరమసా
             ధ్వీగుణంబులప్రోక తిమ్మమాంబ
యేధీరుననుజన్ము లిద్ధదానక్షాత్ర
             భద్రుండు చినవేంకటాద్రినృపుఁడు


తే.

ఘనులు వేంకటరాయవేంకటవరదులు
ననఁ బ్రసిద్ధులు ముగు రట్టియాకువీటి
పురవరాంకుండు త్రిభువనపూర్ణకీర్తి
యతులతేజుండు పెదవేంకటాద్రివిభుఁడు.

7

టీక. ఏమహీవరు = ఏభూపతియొక్క, తాత = పితామహుఁడు, సత్కీర్తి = మంచియశ మనెడు, గంగా = ప్రాయేటియొక్క, జన్మ = పుట్టుకయొక్క, కృతి = ఒనర్పునకు, మహాద్రి = గట్టులఱేఁ డయిన, ఇమ్మభూవరుఁడు = ఇమ్మరాజో, ఏవిభు = ఏప్రభువుయొక్క, తండ్రి = జనకుఁడు, నానావిధ = పెక్కుభంగులయిన, పౌరుష = మగఁటుముల