Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టీక. శ్రీతోన్ = లక్ష్మితోడ, పుట్టి = జనించి, సుధామధుద్రవముతోన్ - సుధా = అమృత మనెడి, మధు = పూఁదేనెయొక్క, ద్రవముతో = తడితోడ, చెన్నొందుపుష్పంబు - చెన్నొందు = ప్రకాశించునట్టి, పుష్పంబు = పువ్వును, శోభాతారుణ్యము = తరుణకాంతి, ఎలర్పఁగాన్ = ఒప్పఁగా, ముడుచు పంపాహేమకూటాశ్రయఖ్యాతబ్రహ్మము - ముడుచు = జడలయందుఁ దాల్చుకొన్నట్టి, పంపా = పంపాసరస్తీరమం దున్న, హేమకూట = హేమకూటపర్వత మనెడు, ఆశ్రయ = ఉనికియందు, ఖ్యాత = పేర్కొనిన, బ్రహ్మము = కర్త - అనఁగా బాలచంద్రుని శిరమునందుఁ దాల్చినదని భావము. విరూపాక్షాహ్వయంబు = విరూపాక్షనామము గలది, ఆకువీటీతిమ్మప్రభు వేంకటాద్రిహృదయాటీకంబు - ఆకువీటీ = ఆకువీడను పత్తనమునకు ఱేఁడైన, తిమ్మప్రభు = తిమ్మరాజుకొమరుఁడయిన, వేంకటాద్రి = పెదవేంకటాద్రిప్రభువుయొక్క, హృదయ = ఉల్లమునందు, ఆటీకంబు = వర్తించునది - బ్రహ్మశబ్దమునకు విశేషణములు, లోకంబులన్ = జనకోటులను, ప్రోచుఁగావుతన్ = రక్షించుఁగాత.

శా.

శ్రీచన్గొండలు రెండు నండ గొని వాసిం బేర్చుచున్ భక్తిసా
మీచీన్యామల పెద్దవేంకటనృపోన్మీలన్మనశ్చాతక
వ్యాచిక్రింసకుఁ గైవసం బయి సదోదంచత్కృపావృష్టిస
ధ్రీచీనం బగుకృష్ణమేఘము జగత్ప్రీతిం గడుం జేయుతన్.

2

టీక. శ్రీ = లక్ష్మీదేవియొక్క, చన్గొండలు = స్తనములనెడు పర్వతములను, రెండున్ = రెంటిని, అండగొని = ఆశ్రయించి, వాసిన్ = ఆధిక్యముచేత, పేర్చుచున్ = ప్రసిద్ధి కెక్కుచును, భక్తి = భక్తియొక్క, సామీచీన్య = కొమరుచేత - అనఁగా నిష్కలంకభక్తిచే ననుట. అమల = పవిత్రుఁ డయిన, పెద్దవేంకటనృప = పెదవేంకటాద్రిప్రభువుయొక్క, ఉన్మీలత్ = వికాసము పొందుచున్న, మనః = డెంద మనెడి, చాతక = వానకోయిలయొక్క, వ్యాచిక్రింసకున్ = గమనేచ్ఛకు - అనఁగా నుదకమును గోరి సంచరించుట, కైవసం బయి = అధీనమై, సదా = ఎల్లప్పుడు, ఉదంచత్ = అడరుచున్న, కృపా = దయారస మనెడి, వృష్టి = వర్షముతోడ, సధ్రీచీనం బగు = కూడి వర్తించునట్టి, కృష్ణమేఘము = కృష్ణుఁడను కార్మెఱుంగు - శ్లిష్టరూపకము. జగత్ = లోకముయొక్క, ప్రీతిన్ = ఇష్టమును, కడున్ = మిక్కిలి, చేయుతన్ = ఒనర్చుఁగాక.

శా.

లోకత్రాణరతిం దదాదిమమహీలోకప్రవేశోత్కభా
షాకౢప్తప్రథమద్వితీయపదగుంజన్మంజుమంజీరగ
ర్జాకల్పామలరామభారతకథాసర్గంబులన్ మించువా
ల్మీకివ్యాసులఁ గొల్చెదం దదుభయశ్లేషార్థసంసిద్ధికిన్.

3