Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

విశ్వేశ్వరవిశ్వాత్మక, విశ్వాధిష్ఠాన యఖిల వేదాంతవచ
శ్శశ్వదభివర్ణ్యమానమ, హైశ్వర్య నిరీహనిత్యయభవశుభమయా.

59

రెంటికి సమము సులభము.

మ.

నిశితప్రజ్ఞతఁ జూడ నేవికృతియున్లే దండ్రు నీయందు నీ
దశరూపాశ్రయణం బొనర్చుట మదిం దర్కింప లోకంబులం
దశుభప్రక్షయమున్ శుభోదయము నుద్యద్భక్తవాత్సల్యతా
తిశయాయత్తతఁ జేయ నింతియ గుణాతీతా ప్రసన్నాత్మకా.

60

రామ. నీ, దశరూప = దశావతారములయొక్క, ఆశ్రయణంబును, ఒనర్చుట = వహించుట.

భారత. ఈదశన్ = ఈప్రకారమున.

క.

అది సకలసదాచారం
బది సర్వజ్ఞాన మది సమస్తజనిఫలం
బొదవినకొలఁది నొకప్పుడు
హృదయము నీయందుఁ జేర్తురేని మహేశా.

61

రెంటికి సరి. సులభము.

క.

అతివాఙ్మనసాస్పద యీ, నుతికొగ్గినసాహసమ్మును సహింపు దయన్
మతి నాకు నేన లజ్జిం,చితి నోయచ్యుత యనంత శివగుణరాశీ.

62

భారత. అతివాఙ్మనసాస్పద = వాఙ్మనస్సులకు గోచరము గానిస్థితి గలవాఁడా, వాఙ్మనసపదము - అచతురాదిసూత్రమున నిపాతము. అచ్యుత = స్థిరా, శివ.

రామ. శివగుణరాశీ.

క.

అనుచుఁ బునః పునరభివం, దనములు నెమ్మనమునం దుదంచితసమ్మో
దనితాంతభక్తిసంతత, వినయంబులు సందడింప వేమఱుఁ జేసెన్.

63

భారత. నెమ్మనమునందు వేమఱుఁ జేసెనని యన్వయము, కడమ రెంటికి సమము.

వ.

తదనంతరంబ.

64


క.

విమలుఁడు రాజన్యోత్తముఁ,డమితతపశ్శక్తిమహిమహర్షీశకృపా
సమవాప్తినిష్టదివ్యా, స్త్రమతల్లీసిద్ధి గని ముదం బందెఁ గడున్.

65

రామ. తపశ్శక్తికి, మహి = స్థానమైన, మహర్షీశ = అగస్త్యునియొక్క, దివ్యాస్త్రమతల్లీ = వైష్ణవచాపబ్రహ్మాస్త్రములయొక్క, సిద్ధి = ప్రాప్తిని.

భారత. తపశ్శక్తిమహిమచేత, హర్షి = హర్షముగల, ఈశ = ఈశ్వరునియొక్క, అస్త్రమతల్లీ = పాశుపతముయొక్క, కడమ సులభము.