Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

జను లందఱు నీయం ద
త్యనురాగముకలిమి నెరపెదరు సత్త్వమహ
త్వనిరూఢిఁ బొల్పెసఁగునీ
యనుజులు భవదీయశాసనైకాయత్తుల్.

9

రెంటికి సమము - సులభము.

వ.

కావున నమ్మహాకార్యంబు నిర్వహింప.

10


ఆ.

అనఘ నీవె తగుదు వనివారితనయాద
రౌచితిఁ గడు నొప్ప నాయతిశుభ
గుణవశు డనిపించుకొని నిజేచ్చఁ జనని
యత్యుదారుఁ డఖిలకృత్యవిదుఁడు.

11

రామ. దశరథుఁడు రఘునాథునికి నీతి యుపదేశించెడిప్రకారము, అనఘ, అనివారితమైన, నయ = నీతియొక్క, అదర = అమితమైన, ఔచితిన్ = ఔచిత్యముచేత, "ఈషదర్థే దరం స్మృత” మ్మని అ. కడు, ఒప్పన్ = ఒప్పుటచే, నీవె తగుదువు, అయతి = ఉత్తరకాలఫలముచేత, శుభములైన, గుణములకు = నిత్యత్వాదిగుణములకు, వశుఁ డనిపించుకొని, నిజేచ్ఛఁ జనని= తనఇచ్ఛను నడవనటువంటి, అత్యుదారుఁడు = అతిసమర్థుఁ డయినవాఁడు, అఖిలకృత్యవిదుఁడు = సర్వకార్యజ్ఞుఁడు, నీవు నీచెప్పినగుణములు గలవాఁడవు గనుక సకలకార్యములను నెఱుఁగుదు వనుట.

భారత. అనఘ, నీవె తగుదువు, అని పలికి, వారి = పాండవులయొక్కయు, తనయొక్కయు, ఆదరౌచితి కడునొప్పఁగా, శుభగుణ = సద్గుణవంతులకు, వశుఁడు = విధేయుఁడు, ఆయతి = నారదుఁడు, అనిపించుకొని = అంపించుకొని, చనన్ = పోఁగా, నియతి = నియమముచేత, “నియతిర్నియమే దైవే" అని వి. ఉదారుఁడు, అఖిలకృత్యవిదుఁడు, అవనివరేణ్యుఁడని ముందరిపద్యమున కన్వయము.

ఆ.

ఆయవనివరేణ్యుఁ డాయాగమవ్యయా
గమసముచితధర్మగతి నడపుట
కై జయింపవలయు నాశల నన్నింటి
నని కృతిజనగోష్ఠి నాకళించి.

12

భారత. ఆ, అవనివరేణ్యుఁడు = ధర్మరాజు, అవ్యయ = నాశములేని, ఆగమసముచిత = వేదోచితమైన, ధర్మగతిన్ = ధర్మవర్తనచేత, ఆ, యాగమును, నడపుటకై = చేసెడికొఱకు, ఆశలన్ = దిక్కులను, జయింపవలయునని, కృతిజనగోష్ఠిన్ = విద్వజ్జనులతోడి ప్రసంగముచేత, ఆకళించి = తెలిసి, రిపుల నేలఁగలిపె ననుపర్యంతము కుళకము.