Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. అవనివరేణ్యుఁడు, ఆయాగమ = ఆదాయప్రాప్తికిని, వ్యయాగమ = వ్యయప్రాప్తికిని, సముచిత = తగిన, ధర్మగతి = ధర్మవర్తనను, నడపుటకై, 'సీ. ఆయంబునందు నాలవభాగ మొండె మూఁడవభాగ మొండె నందర్ధ మొండెం, గానివ్యయము సేయరాదు నరపతికిని' అని సభాపర్వములోఁ జెప్పినాఁడు గనుక, ఆశలన్ = వాంఛలను, ఆశలను జయింపనివానికి నుచితధర్మము నడవదు గనుక, అనికృతి = శఠత్వము లేని - కపటము లేనివా రనుట, జనులతోడి = గోష్ఠిచేత, ఆకళించి = తెలిసి, ఆయవ్యయౌచిత్యమును, ఆశాజయోపాయమును దెలిసి నడపు మనుట.

తే.

సత్త్వధర్మకళావిరాజత్ప్రతాప
ఘనుఁడు రాజులలోఁ బెద్ద యనఁగఁ జనుఁ బ్ర
కృష్టతనుజరాసంధుండు కేవలముని
జేష్టకర్మాక్షముం డని యెన్ను మదిని.

13

రామ. సత్త్వ = బలిమిచేతను, ధర్మకళా = ధర్మశాస్త్రముచేతను, విరాజత్ = ఒప్పుచున్న, ప్రతాపముచేతను, మరుఁడు= అధికుఁడైనవాఁడు, పెద్ద యనఁగ, చనున్ = తగును, ప్రకృష్ట = అధికమైన, తను = శరీరముయొక్క, జరా = ముదిమియొక్క, సంధుండు = సంధానము గలవాఁ డైనను, ముదిసినవాఁ డైన ననుట, నిజ = తనకు, ఇష్టమైన, కర్మ = ప్రయోజనమందు, అక్షముండు = అసమర్థుఁడు, తనముదిమిచేత నాచారలోపమే కాని పెద్దతనము కలిగియు నియమము లేక యుండును, అని = ఇటని, మదిన్ = మనస్సున, ఎన్నుము, తాను ముదివాఁడు గనుక రాజ్యపాలనమునకు నీవె తగుదువని తాత్పర్యము.

భారత. సత్త్వ = బలిమిచేతను, ధర్మకళా = ధనుర్విద్యచేతను, ప్రకృష్టతన్ = ఆధిక్యమున, జరాసంధుండు, నిజ = స్వకీయమైన, ఇష్టకర్మ = యాగకర్మమందు, “ఇష్టం యాగాదికర్మస్యా" త్తని అ. కరికలభవత్ప్రయోగము. అక్షముండు = ఓర్పు లేనివాఁడు, అని, ఎన్నుమదిన్ = ఎంచెడిమనస్సుచేత.

తే.

విహితసన్మంత్రుఁ డగుచు వివేకఘనుఁడు
విహతి లేకొప్పునచ్యుతవిజయసంయు
తప్రహితభీమసేనోద్ధతిప్రవృద్ధి
చేత రిపు నేలఁగలపెను సిరులు గొనుచు.

14

భారత. విహిత = చేయఁబడిన, సన్మంత్రుఁ డగుచు = మంచియాలోచన గలవాఁడౌకొంచును, వివేకఘనుఁడు = ధర్మరాజు, ఒప్పుచున్న, అచ్యుతవిజయసంయుత = కృష్ణార్జునసహితముగా, ప్రహిత = అంపఁబడిన, భీమసేనునియొక్క, ఉద్ధతి = ప్రహారములయొక్క, ప్రవృద్ధిచేత, రిపున్ = శత్రుఁడైనజరాసంధుని, నేలఁగలపెన్ = సంహరించెను.