Jump to content

పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బడువచోవిన్యాసమే రీతి యనఁబడును. దేశము లనేకములు; అందలి జనులరుచిభేదములు ననేకములు. అందుచే రీతులభేదముల నెన్నుటకు సర్వజ్ఞుఁడగు నీశ్వరుఁ డొక్కడే సమర్థుఁ డని యీతఁడు నుడివియున్నాఁడు.

దండిమతమున రీతు లనేకములు. అందు సూక్ష్మభేదములు గల తక్కినవానిని వదలివైచి ప్రస్ఫుటవ్యత్యాసముగల వైదర్భ-గౌడీయముల మాత్రము దండి విశేషముగా వర్ణించియున్నాఁడు.

వృత్తులు:-1. కైశికి. 2. ఆరభటి. 3. భారతి. 4. సాత్వతి. ముద్ర (= సాభిప్రాయార్థవిన్యాసము) 4 విధములు:-1. విభక్తిగతము. 2. వచనగతము. 3. సంవిధానగతము. 4. సముచ్చయగతము.

అన్యోక్తుల ననుకరించుట ఛాయ. ఇది 5 విధములు- 1. లౌకికము. 2. స్ఖలితము. 3. ఛేకము 4. ముగ్ధము. 5. వేటోక్తి. జను లసంఖ్యాకు లగుటచే నన్యోక్తిచ్ఛాయాభేదములు ననంతము లని యీతఁ డనెను.

విశేషము:- ఈఛాయ నితరాలంకారికులు శబ్దార్థహరణము, హరణము, ఉపజీవనశిక్ష మొదలగుపేళ్లతో వ్యవహరించిరి. వామనుఁడు నానందవర్ధనుఁడు తమకృతులలో నీవిషయమును స్పృశించియున్నారు. ఈవిషయమును గూలంకషముగ సోదాహరణముగఁ జర్చించిన మహనీయుఁడు రాజశేఖరుఁడు. ఈతఁడు కావ్యమీమాంసయందు మూఁడు ప్రకరణములు [XI-XIII) తద్విచారమునకు వినియోగించెను. హేమచంద్రుఁడు తన'కావ్యానుశాసనము'నకుఁ దాను రచించిన 'వివేక' మను వృత్తిలోను, వాగ్భటుఁడు 'కావ్యానుశాసనము' నను నిందలివిషయము లనేకములఁ బరిగ్రహించియుండిరి. భోజుని 'సరస్వతీకంఠాభరణము'నందు నీవిషయ మించుక కలదు. క్షేమేంద్రుఁడు కవిశిక్షాగ్రంథమగు తన 'కవికంఠాభరణము'న నీవిషయమును విపులముగఁ జర్చించియున్నాఁడు. రాజశేఖరుఁడు (XI అధ్యా. 61 పు] ఈవిషయమును గూర్చి యొకచక్కని యాభాణకమును గ్రోడీకరించియున్నాఁడు: 'లోకమునఁ జోరుఁడు గాని, కవి గాని, వర్తకుఁడు గాని యుండఁడు. ఎవఁడు తనచౌర్యమును గప్పిపుచ్చుకొనఁగలఁడో వాఁడు నింద నొందక యానందము నందును.'