ఈ పుట ఆమోదించబడ్డది
రమ్యాలోకము
కలదు ప్రభుశక్తి భాషకు; బలిమి కలిమి
నాచికొని స్వీయకోశ కంఠప్రబద్ధ
ములుగ చేసికొన్న సువర్ణ పుంజములకు
అరవ కన్నడ యాజమాన్యములు కలవె ?
దేశమం దేమి, దేశసూక్తి నిధులందు
నేమి, పరవస్తు పదజాత మిమిడి యునికి,
తత్తదీయ పరాక్రాంతి దక్షతలకు
చిహ్నములుగ నవ్యులు విచక్షింతు రెపుడు.
సంస్కృతము లగుగాక, దేశ్యంబు లగును
గాక, పరదేశజము లగుగాక సూక్తు
లాత్మభాషా శ్రుతిస్థాయి ననులయించి
లీన మగును స్వస్థాన వేషానుకృతుల.
ధేనువులు తిను బహువిధ తృణచయమ్ము,
త్రావు నానానదీ కూప జీవనమును,
కలిసి పరిణమింపవె పాలుగా ధరిత్రి?
శబ్దమేళన తంత్రనై జమ్ము నిదియె.