పుట:రమ్యా లోకము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సుందరం బెల్ల శివమయి శోభ జెందు,
శివమయం జెల్ల శాంతమై సిద్ధి నొందు.
సాంగ సుందర శివమయ స్వాదువయిన
కవి కళాకృతి శాంతమున్ శివము నగును.

వాసనా కర్మ నియతమౌ బ్రహ్మ సృష్టి
నందచందాలు సామాన్య మగుట గాదె !
ఇష్టరస రాగ భావనోద్దిష్టముగను
కవి సృజించె హ్లాదైక వాఙ్మయజగంబు.

క్రౌంచ మిథునానురాగ దారణము వలని
శోకమే శ్లోకమయి, యే మృదూకృతాత్ము
ముఖవియత్పథమున గంగబోలె వెడలె
ఆ వచస్వి ప్రాచేతసు నాత్మ దలతు !

సకల కళ్యాణవసతి యౌ ప్రకృతిలోన,
భావభాషాభినయు లైన ప్రజలయందు,
హ్లాదరామణీయకముల పాదు లెఱిగి,
కావ్యరతుడైన ఘను నెంతు కాళిదాసు !