పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డుటకు నాతని గ్రంథములు చదివియు, శైలి కుదుర్చుకొనఁ బ్రయత్నించుటయు చూచుచునేయున్నారము. అదిఁ గాక యీతఁడు ఘనపండితుఁడు. లాక్షణికులుఁ గూడ నాతనిని లాక్షణికకవిగా నంగీకరించియున్నారు. మఱియు వీరల తండ్రి పూర్వకాండమును, తాము ఉత్తరకాండమును ఉభయంబులు ద్విపదకావ్యంబులే రచించుటయు పూర్వకాండకవనంబుతో అభేదముగా కలిసిపోయి ఏకగ్రంథముగా వచ్చునట్లు ప్రయత్నించి వ్రాయకూడదా. వీరు మంచివిద్వాంసులని చెప్పఁబడుచున్నవారలుగదా. కవనధోరణి పోలియున్నంతమాత్రన నాతఁడే దీని రచియించెనని యూహింపవలనుపడదు. తండ్రియాజ్ఞచే రచించినదియు, శైలిసరణిఁబట్టియు నిదియుగూడ నాతనికాలమునాటిదియే యని స్థిరపడుచున్నవి. కాన నిదికూడ భాస్కరరామాయణాదులకు ముందైయుండవచ్చును. ఆంధ్రదేశంబున నింకేరామాయణంబునకు దీనికి వచ్చినంతవ్యాప్తి వచ్చియుండమియే దీనిప్రాశస్త్యప్రాచీనత్వాదులు వెల్లడియగుచున్నవి. ఇయ్యది సలక్షణంబై, సరసకవితానిపుణత కలిగి, పదలాలిత్యంబుకలదై, సమంచితధారాప్రవాహమై, సహజశైలిని వ్రాయఁబడి పండితపామరజనానురంజకమై భక్తిరసమున నొప్పుచున్నది. వాఙ్మయాభివృద్ధి కెంతయుఁ దోడ్పాటగుచున్నది. పండితవరుఁడగు బుద్ధరాజే వీరలగుఱించి "బహుపురాణజ్ఞులు బహుకళాన్వితులు, బహుకార్యకోవిదుల్... నాకులదీపకుల్ నాకూర్మిసుతులు" అని స్తోత్రించుటయె వీరల పాండిత్యప్రకర్షణరసజ్ఞత్యాదులు వెల్లడియగుచున్నవి. గుణగ్రహణపారీణు లగు చదువరు లిందలి రసమును గ్రహించి కృతార్ధు లయ్యెదరు గాక.

ఇందుఁ గొంతభాగము లేటు పోలవరం జమీందారుగారి సరస్వతిపత్రికలో ముద్రితమైనది. ఇదియును మిగిలిన తాళపత్రగ్రంథంబును ‘‘ఆంధ్రపరిశోధకమహామండలి"కి స్వార్థత్యాగబుద్ధితో నొసంగిన శతావధానులు దివాకర్ల తిరుపతిశాస్త్రిగారికి నాకృతజ్ఞతావందనంబు లర్పించుచున్నవాఁడ.

ఇట్లు

చిత్రాడ,

చెలికాని లచ్చారావు,

9–7–20

సంపాదకుఁడు, అముద్రితాంధ్రగ్రంథసర్వస్వము