పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుమ - యిప్పుడేవచ్చినాను. తోటలో నాకు సంపెంగ పువ్వులు కోసియిస్తామన్నారు వస్తారా?

మతి - యిప్పుడు రావడానికి తీరుబడి లేదు. నేనును యిప్పుడు పుస్తకంలో ప్రాణాయామాన్నిగురించి చదువుతూ వున్నాను. అది అర్ధంకావడంలేదు. అదిగ్రహిస్తేనేకాని నేను యెక్కడికీ రాను – ఓరీ రామా! మా మాటలు అలకిస్తూ అలానిలుచున్నా వేమి? నీవు కింద కూర్చుండి పుస్తకాలన్నీ బల్లమీద వరుసగాపెట్టు.

రాము — చిత్తము. (అని యొకపుస్తకము క్రిందవేసి దానిమీద కూర్చున్నాఁడు.)

మతి - ఓరిపశువా! పతంజలిమీద కూర్చున్నా వేమిరా? లేలే. అపచారంవస్తుంది. ఆయన యెవరనుకున్నావు? మొట్టమొదట యోగ సూత్రాలుచేసిన మహానుభావుడు.

రాము – అపచారం రావడానికి నేను యెవరిమీదా మనిషి మీద కూర్చోలేదు. బట్టబురదవుతుందని యెందుకూ పనికిమాలిన యీపాతతుక్కు పుస్తకంమీద కూర్చున్నాను. కిందమనిషివుంటే కూర్చోవడానికి నాకంత బిత్తిగా కళ్ళుకనపడ వనుకున్నారా యేమిటి?

మతి – అది పనికిమాలిన పాతతుక్కుపుస్తకమట్రా? దాని విలువ చదువురాని శుద్దపశువువు నీకు యేమితెలుస్తుంది? నేను నిన్నటి రోజల్లా కష్టపడి అంటలుకట్టుకుపోయిన పత్రాలన్నీ జాగ్రతగావిడదీసి పురుగులుదులిపివేసి కట్టకట్టినాను. రెండు వ్యాఖ్యానాలతోవున్న దాన్ని పనికిమాలిన తుక్కంటావురా?