పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాముడు పుస్తకాలకట్ట కిందపడవేసినాడు. ఓరీ! రామా! యేమిటి చేస్తూవున్నావు?

(అప్పుడు రాముఁడు ప్రవేశించుచున్నాఁడు.)

రాము — యేమీ చెయ్యడంలేదు. పుస్తకాలు చేతులోనుంచి జారిపోయినవి. దిక్కుమాలిన పుస్తకాలు వొక్కొక్కటి నాలుగేసి మళ్ళ బలువువున్నవి. ఈగదిలోకి తీసుకురావలసినవి యిటువంటివి ఫది పుస్తకాలున్నవి. ఈపొస్తకం కాలిమీదపడి కాలివేళ్ళన్నీ నలిగి పోయినవి. (అనిచేతిలోని పుస్తకములుబల్లమీద పెట్టుచున్నాఁడు.)

సుమ - (నవ్వుచు) ఆ పుస్తకం కిందపడవేసినందుకు నాన్న గారు కోపపడుతా రేమో!

రాము - నేను పడవెయ్యలేదు. దానంతట అదేపడ్డది. చేతులో వుండకుండా పసిపిల్లకాయలాగు జారికిందపడ్డది. నా తప్పితం యేమి లేదు.

మతి - ( వెలుపలనుండి) రామా! రామా!

రాము — వస్తూవున్నాను. నచ్చెవచ్చె - అమ్మగారూ! చూచినారా ఆయన యెలాగు తొందర పెడుతూవున్నారో.

మతి - (వెలుపలనుండి) రామా! రామా!

రాము — తొందరపడకండి. వస్తూవున్నాను. ఇక్కడ నేను ఆడు కోవడంలేదు. (అని క్రిందపడ్డ పుస్తకమును చేతితో తీయుచున్నాఁడు.)

(అంతట మతిమంతుఁడు ప్రవేశించుచున్నాఁడు)

మతి - రామా! మిగిలిన పుస్తకాలు నీవుయివేళ యిక్కడకు తీసుకునిరావడం వున్నదా? రోజంతా యిక్కడనే వుంటావా? అమ్మాయీ! నీవూ యిక్కడనే వున్నావా?