పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుమ — బాబయ్యగారూ! మీకు దెబ్బతగలలేదుగదా? సుబలా! నీవు వట్టి అల్లరివాడవయినావు. (రాముని మొగమువంకచూచి) ఓస్సీ! వీడు మనరాముడేనా? తలగుడ్డా వేషమూ చూచి యెవరో అను కున్నాను.

మతి – (మెల్లగాలేచి) రాముడా? వీడికీ చేటుకాలం వచ్చిందేమి? యిందులో యేదోకుట్రవున్నది. (వెనుకతిరిగి సుబలుఁడు నవ్వుచుండుట చూచి) ఆ పిచ్చికుర్రవాడు యేలా నవ్వుతూవున్నాడో? ఇదంతా అతనిపని అయివుంటుంది.

సుబ - మామా! మీకు వెయ్యి నమస్కారాలుచేస్తాను. ఈపని చేసినందుకు నన్ను క్షమించండి. మీదగ్గిరచేరేవాళ్ళూ మీ దగ్గిర యోగమనీ మంత్రాలనీ మాట్లాడేవాళ్ళూ యెటువంటివాళ్ళో చూపించడానికి నేను యీపనిచేసినాను.

మతి - (తనలో) వీడు మహాతెలివయినవాడుగా కనపడుతూ వున్నాడు. (బిగ్గరగా) అబ్బాయీ! యిఖ యీవైద్యులనిద్దరినీ మన యింటికి యెప్పుడూ రానియ్యను. నేను నీవన్నట్లు యోగపుపిచ్చ మానివేసి తెలివిగలిగి వుంటాను.

రాము — వీరిద్దరూ సఖ్యపడ్డారు. ఈయన నాతాళం పట్టిస్తాడు. దూరంగా వెళ్ళవలెను.

మతి - (రామునిజూచి) పోకు. ఆగు. నీకు యేమిశిక్షచెయ్య వలెనో నాకు తెలియకుండావున్నది.

రాము — ఈచిన్న వాడిదిగాని యిందులో నాతప్పితం యెంత మాత్రమూలేదు.

మతి - చాలును. ఈపాటి నోరుమూసుకో. నిన్ను పనిలో నుంచి తీసివెయ్యవలెను.