పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సదా - మనం నాడికూడా పరీక్షచేసిచూతాము.

రాము – అయ్యా! వైద్యులు చెయ్యిచూస్తారట. మీచెయ్యి వక్కమాటు చాపండి.

సదా - అయ్యా! కుడిచెయ్యి యిలాగివ్వండి. (అని మణికట్టు పట్టుకొనుచున్నాఁడు.)

గజా – ఎడమచెయ్యి నాచేతికియ్యండి. (అని పట్టుకోఁబోవు చున్నాఁడు.)

మతి - (చేయివదల్చుకొని గింజుకొనుటచేత కట్టినత్రాళ్ళు కొంచెము వదులుకాఁగా కుర్చీతోలేచి) ఓముసలిగాడిదె కొడుకుల్లారా! మిమ్మలిని యిద్దరినీ తలబద్దలుకొడుతాను వుండండి. నాకుకాదు మీకే పిచ్చయెత్తింది. అని యిద్దఱిని చెఱియొక గుద్దును వేయఁగా వారు పరుగెత్తుచున్నారు.)

రాము - (మతిమంతుని కుర్చికాళ్ళు పట్టుకొని వెనుకకు లాగుచు) మీకు భయంలేదు. మెల్లిగా పరుగెత్తండి.

మతి - పిచ్చికుక్కలకొడుకుల్లారా! పారిపోకండి. (అని కుర్చీతో రాముని వారికేసి యీడ్చుచు రాముఁడును తానును ముందుకు పడు చున్నారు.)

సుబ — అయ్యో! (అని నవ్వుపట్టలేక నోటికి చేయడ్డము పెట్టు కొని క్రింద కూలఁబడుచున్నాఁడు.)

సుమ — అయ్యో! (ఏడ్చుచు తండ్రికి సహాయపడుటకు పరుగెత్తు చున్నది.)

రాము – నామోకాళ్ళు విరిగిపోయినవి. (అని లేచి సుమతి సహాయముతో మతిమంతుని కుర్చీకట్లు విప్పుచున్నాఁడు.