పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మతి -- (వారి కంఠస్వరముగుఱుతుపట్టి) ఓసదానందయోగి! గజాననదాసా! మీరు యిదిచూచినారుగదా? నన్ను మీరు చూడ గలరుగాని మిమ్మలిని నేను చూడలేను. మాయింట్లోవున్న వారందరికీ వక్కసారిగా పిచ్చయెత్తిపోయింది. ఈపశుప్రాయుడు పోలీసువాడి వేషంవేసుకునివచ్చి నన్ను కట్టివేసినాడు.

సుబ — అయ్యా! మా మామగారు యెటువంటిదురవస్థలో వున్నారో మీరు చిత్తగించినారా!

రాము — యెవరికీ హానికలుగకుండా తన్ను కాపాడుతూవున్న వాణ్ని నన్ను యెలాగు దూషిస్తూవున్నారో చూచినారా?

సదా - ఇదుగో వచ్చి చూస్తాము. (అని వారిద్దరును చేరువకు రాఁగా రాముఁడు ముందుకు వచ్చుచున్నాఁడు.)

మతి - ఇప్పుడు కన్నులయెదటికివచ్చినావు. ఇఖ యోగదృష్టితో చూచి నిన్ను నిముషంలో నాస్వాధీనం చేసుకుంటాను. (అని రాముని వంక రెప్పవాల్చక చూచుచున్నాఁడు.)

రాము -- మీమంత్రం పారకుండా నేనూ మిమ్మలిని యోగ దృష్టితో చూస్తాను. (అని గ్రుడ్లు పెద్దవిచేసి తేఱిపారచూచు చున్నాఁడు.)

సదా - (మతిమంతుని వంకచూచి) ఈయన వెర్రిచూపులు చూస్తూవున్నాడు. గుడ్లు పెద్దవయినవి. ఇది పిచ్చకావడానికి సందేహం లేదు. నేను మొదటినుంచీ యీయనకు యెప్పుడో పిచ్చయెత్తుతుందనే అనుమానపడేవాణ్ని.

గజా - (మతిమంతుని తేరిపారచూచి) ఆ ముఖచిహ్నలనుబట్టి చూస్తే యిది భూతావేశంగా తోస్తూవున్నదిగాని చూపులలో పచ్చ లక్షణం యెంతమాత్రమూ కనపడడంలేదు.