పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాము — వూరికే పెనుగులాడకండి. నేనుయెప్పుడూ పొరపాట పని చేసేవాణ్ని కాను. (అని మరింతగట్టిగా బిగించి కట్టుచున్నాఁడు.)

మతి - (కోపముతో) ఇదేమిపని? నేను చెప్పినాకానీ నీకుబుద్ధి రాకుండావున్న దేమి? పిచ్చివాణ్ని నేనుకాను. నాకుయెదురుగా కుర్చీ మీద కూర్చున్న అతడు పిచ్చివాడు.

రాము - (అద్భుతపడ్డట్టు తలయూచుచు) పిచ్చవాళ్ళు యెప్పు డూ యిలాగే అంటూవుంటారు.

సుబ — నాకు బహువిచారంగా వున్నది.

రాము – నాకూ విచారంగానేవున్నది. అయినాకానీ పిచ్చ వాళ్ళ విషయంలో చెయ్యవలసినపని చెయ్యకతప్పదు.

మతి - (ఆగ్రహముతో) ఓరిపశువా! నేను పిచ్చవాడనుట్రా? (అని పండ్లుపటపట కొఱుకుచున్నాఁడు.)

రాము — ఇతనిది సాధారణమయిన పిచ్చకాదు. నేను యింత మంది పిచ్చవాళ్ళను చూచినానుగాని ముసలితనంలో యిలాపళ్ళుకొరికే పిచ్చి నేను యిదివరకు యెక్కడా చూడలేదు. మీ రేమంటారు?

సుబ — అవును. ఇది బహుప్రబలమయిన పిచ్చ.

మతి - సుబలా! నీవు పిచ్చలోవుండి యీ దౌర్జన్యంలో నీవు నాకు యేమీనయం చెయ్యలేని స్థితిలోవున్నందుకు నాకు బహువ్యస నంగావున్నది.

సుబ — నాకూ వ్యసనంగావున్నది.

రాము —- ఈపిచ్చాయనతో మాటకుమాట జవాబుచెప్పకండి.

మతి - ఓరామా! ఓసుమతీ! ఓగౌరీ! వేగిరంవచ్చి నన్ను వద లించండి. అని పెనఁగులాడుచు కేకలు వేయుచున్నాఁడు.)