పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుబ - యేడిసినారులే. సుమతీ! భయపడకు. తిన్నగాకూర్చో. నాకేసి మొగంయెత్త చూడు. మనబాల్యస్నేహమంతా యీనాలుగు సంవత్సరాలలోనే మరిచిపోయినావా?

సుమ - (అతనివంక చూచుచు) బావా! నీకు నిజంగా పిచ్చ వున్నదోలేదో చెప్పు.

సుబ - నీకలాగంటి సంశయం యెందుకు కలిగింది?

సుమ — తల్లి పోయినప్పటినుంచీ మీమేనల్లుడికి విచారంచేత పిచ్చ యెత్తిపోయిందని మానాన్న గారిపేర మీబాబయ్యగారే వ్రాసినారే.

సుబ — దానికర్థంస్పష్టంగా తెలుస్తూనేవున్న ది. విచారంచేత పిచ్చయెత్తిపోయిందంటే దుఃఖంచేత యేమీతోచకుండా వున్నదని అర్థంనీకు బోధపడలేదా? నన్ను చూచినతరువాత యిప్పుడైనా నాకు పిచ్చ లేదని నీకు నిశ్చయంకలిగిందా లేదా?

సుమ - నీవు యిప్పుడు మంచివాడవులాగే కనపడుతూవున్నావు.

సుబ — అలాగైతే నిన్ను వక్కప్రశ్న అడుగుతాను. నిజం చెప్పు. నిన్ను మీనాన్నగారు యెవరికైనాయిచ్చి వివాహం చెయ్య డానికి నిశ్చయించినారా యింకాలేదా?

సుమ — (తలవంచుకొని) యింకా యెవరికీ యివ్వడానికి నిశ్చ యం చెయ్యలేదు.

సుబ - అలాగయితే నన్ను వివాహం చేసుకోడానికి నీకు యిష్టంవున్నదా? మనం యిద్దరమూ మేనత్తమేనమామ బిడ్డలమూ బాల్యస్నేహితులమూ మాత్రమేకాకుండా యేకశరీరులముకూడా కావలెనని నాకు కోరికవున్నది. వేగిరంచెప్పు.

సుమ - నేను ఆలోచించుకొని చెపుతాను.

సుబ - ఆలోచనా లేదు యేమీలేదు. వప్పుకో .