పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మతి – (చిఱునవ్వుతో రెప్పవాల్చక చూచుచు) సుబలా కొంచెం శాంతించు. (తనలో) యిప్పుడు లొంగుబాటులోలేదు. పోలీసుబంట్రోతువస్తే, బాగావుండును.

సుబ — శాంతిస్తాను. (అని మీదికి వచ్చు చున్నాఁడు.)

సుమ – బావా ముసలాయనజోలికి రాకు. (అని యిద్దఱికిని నడుమ వచుచున్నది.)

మతి - అమ్మాయీ! అడ్డంరాకు. నాకు భయంలేదు. నన్ను యోగదృష్టితో చూడనియ్యి.

సుబ — ఓప్రియురాలా! నీ వేమిభయపడకు. నీతండ్రికి నేనేమి అపాయంచెయ్యను. మామగారూ! నేను వక్కనిముషం మీకొమా ర్తెతో మాట్లాడవలెను. దయచేసి మీరు వక్కపర్యాయం అవతలికి వెళ్ళండి. (అని సుమతిని ముందుకులాగుకొని, మతిమంతుని మెల్లగా గుమ్మమువద్దకు త్రోసికొనిపోయి యావలకుఁ బంపి తలుపు వేయు చున్నాఁడు.)

సుమ — అయ్యో! మానాన్నగారు-

సుబ — సుమతీ! నీవికారపుచేష్టలుమాని వక్కనిముషం నాతో నెమ్మదిగా మాట్లాడు. యిలావచ్చికూర్చో. నాకేసి బెదరిచూడకు. నాహృదయేశ్వరీ! భయంమాని నేను యిప్పుడు తరిమివేసిన యిద్దరు ముసలివాళ్ళూ యెవరోచెప్పు.

సుమ — (కూరుచుండి) వారు పిచ్చవైద్యులు.

సుబ — వాళ్ళు పిచ్చవాళ్ళని నేను చూడడంతోటే అను కున్నాను.

సుమ - వారికి పిచ్చలేదు. వారు పిచ్చకుదిర్చే వైద్యులు. నీపిచ్చయెటువంటిదో చూడడంనిమిత్తం వారు వచ్చినారు.