పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుమ - నీవు యీసంగతి మానాన్నగారిని అడగవలెను.

సుబ — ఆయన వప్పుకోడు. ఆయన యిప్పుడు నన్ను చేసిన అవమానానికి నేను తగినపని చేస్తాను.

సుమ - నీవు అలాగంటిపని యెంతమాత్రమూ-

సుబ — తొందరపడబోకు. నిజంగా నేను యేమీచెయ్యను. పరియాచకానికి వక్క తమాషాచేస్తాను. ఇందులో నాకు నీవుకూడా సహాయంచెయ్యవలెను.

సుమ - అదేమిటో అంతా నాతో చెప్పు.

సుబ — ముందుగా చెప్పడానికివల్లకాదు. కాని కొంచెంసేపటికి నీకదంతా తెలుస్తుంది. ఆయననన్ను పిచ్చవాణ్నిగా కట్టివేసినాడు. అయన విషయంలో ఆపని నేనుచేస్తే ఆయనకు యెలాగువుంటుందో చూతాము.

సుమ — ఆయనకు యేమీశరీరబాధమాత్రం చెయ్యకు. ఆయన పిలుస్తూవున్నారు. నేను తలుపుతీసి లోపలికి వెళ్ళిపోతాను. (ఆ ప్రకా రముగా చేయుచున్నది.)

[మంగలికత్తి చేతఁబట్టుకొని మతిమంతుఁడు ప్రవేశించుచున్నాఁడు.]

మతి - (తనలో) నేను యిప్పుడు యితనికి తలగొరగవలెను. లేక పోతే పిచ్చ నిమ్మళించదు.

సుబ —- (తనలో) ఇతడు మంగలికత్తి తెచ్చినాడు. గొంతుక కోస్తాడాయేమిటి? (బిగ్గరగా) మామా! ఆగండి. ఆచేతిలోనిది దూరంగా పెట్టండి.

మతి - (తనలో) ఇతనికప్పుడే అనుమానం కలిగింది. యేమరి పాటుగా వున్నప్పుడు ఆపనిచెయ్యవలెను. (బిగ్గరగా) అబ్బాయీ! నా దగ్గిరగా వచ్చికూర్చో.