పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గౌరి - (తనలో) ఇతణ్ని పిచ్చవాడంటారేమి? ఈయన మహా రాజులాగు మాట్లాడుతూవున్నారు.

సుబ — (ఉత్తరము చేతికిచ్చి) యీవుత్తరం తీసుకునివెళ్ళి నీయజ మానురాలికియ్యి. యిదుగో నీబహుమానము. (అని నాలుగు అణా లిచ్చుచున్నాఁడు.)

గౌరి - (సంతోషముతో) వుత్తరం యిచ్చివస్తాను. వుత్తరం తీసుకుని వెళ్ళినప్పుడల్లా యిలా బహుమానం యిస్తూవుండవలెను.

సుబ - నీవు బహుమంచిదానవు. అలాగే యిస్తూవుంటాను. వేగిరంవెళ్ళు (అని వీపుమీద తట్టుచున్నాఁడు.)

[అప్పుడు మతిమంతుఁడు ప్రవేశించుచున్నాఁడు.]

మతి - (తనలో) అడుగో సుబలుడు దాన్ని కొడుతూవున్నాడు నేను మళ్ళీ యోగదృష్టితో చూచి శాంతపరచవలెను.

గౌరి - (చూచి పరుగెత్తుచు) అరుగో! అయ్యగారు వస్తూ వున్నారు. (అని వెళ్ళుచున్నది.)

సుబ — ఆవెర్రివాడా? (అని మరియొకదారిని వెళ్ళుచున్నాఁడు.)

మతి – అయ్యో! కుర్రవాడు తప్పించుకొని పోయినాడు. పిచ్చ యింతవేగంగా హెచ్చిపోవడం నేను యెక్కడాచూడ లేదు.

[రాముఁడు ప్రవేశించుచున్నాఁడు]

రాము – అయ్యా! మీకోసం యెవరో యిద్దరు పెద్దకుంకం బొట్లు పెట్టుకునివచ్చి వాకిట్లోనిలుచుని వున్నారు. వారినిచూడడం తోటే దెయ్యాలపోతులేమోనని నాకు భయంవేసింది.

మతి - వారువైద్యులయి వుంటారు. సందేహంలేదు. వారిని లోపలికి తీసకునిరా.