పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దొన్నెలు తెచ్చినాను గనుక వీటితో యితడు యెవరికీ హానిచెయ్య లేడు. (అని క్రింద పెట్టుచున్నాఁడు.)

సుబ - (విస్తరిముందు కూరుచుండి) ఈమాటయినా మంచి రొట్టెలు తెచ్చినావా? వెండిగిన్నె లోపలపడవేసి యీవెధవదొప్ప తెచ్చినావేమి? లోపలకివెళ్ళి గిన్నెతీసుకునిరా. (అని పోకదొప్ప విసరి వేయుచున్నాఁడు.)

రాము - గిన్నెతీసుకునిరాను. మిమ్మలినినమ్మి మీచేతికి గిన్నె యివ్వడం క్షేమంకాదు. (తనలో) ఈయనచేతికి గిన్నెలూ గరిటెలూ యిచ్చి వాటితో నాతలబద్దలు కొట్టించుకుంటానా? నాకు అపాయం రాకుండా యెలా కాపాడుకోవలెనో నాకు బాగా తెలుసును. నేను మోసపోను.

సుబ - (కోపముతో) జాగ్రత. నన్నునీవు దొంగవాణ్నిగా భావిస్తూవున్నట్టున్నావు.

రాము — ఆసంగతి నాకేమీతెలియదు. మీకది ముదిరితే అపాయం సంభవిస్తుంది. గనుక మీదగ్గిర గిన్నెలు మొదలయిన గట్టి వస్తువులు యేమీ వుంచవద్దని మీమామగారు సెలవిచ్చినారు.

సుబ — (కోపముతో) ఏదిముదిరితే-

రాము — మీకున్నజబ్బు.

సుబ - జబ్బేమిటి?

రాము – అయ్యగారు దానికేమిటో పేరుపెట్టినారు. జ్ఞాపకము చేసుకుని చెపుతానువుండండి. 'చిచ్చాల్యం' జ్ఞాపకం వచ్చింది. అవును అదే.

సుబ - నీమొఖం చిచ్చాల్యం యేమిటి?

రాము — దానికి యింకోపేరు "తిభ్రమ"