పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[రెండుగిన్నెలును, ఒకగరిటెయు పట్టుకొని రాముఁడు ప్రవేశించుచున్నాఁడు.]

రాము — ఇదుగో మీకు ఔషధం - కాదు భోజనం తీసుకుని వచ్చినాను.

సుబ - ఆగరిటెలోది యేమిటి?

రాము — బుడంవరుగు. నేతిలోవేయించినాము.

సుబ — ఆగిన్నెలలోదో?

రాము — వకగిన్నెలోది మిరియాలచారు. రెండోగిన్నేలోది పెసరట్టూను. పొట్టుతియ్యకుండా ముడిపెసలు నూరి రొట్టెలు చేసినాము.

సుబ - యేడిసినట్టేవున్నది. యీభోజనం. ఈపాడురొట్టెలు యెవరికికాలెను?

రాము – కోపపడకండి. మీరు రెండురొట్టెలు ఫలహారంచేస్తే కడుపులోకొంచెం చల్లపడి శాంతిస్తుంది. భోజనం చెయ్యండి.

సుబ — (లేచి రాముని జుట్టుపట్టుకొని గట్టిగా ఊపి) నన్ను యీప్రకారంగా అడవిమృగంలాగు చూడడానికి యింట్లోవాళ్ళందరూ కలిసి యేదో కుట్రచేసినారోలేదో నిజంచెప్పు.

రాము — (జుట్టువదల్చుకొనుచు) నాజుట్టువదలండి. మృగంలాగు చూడడానికి కుట్రచెయ్యడంయేమిటి? మీరు నిజంగా ఆలాగే కన బడుతూవున్నారు. మీరు పెద్ద భల్లూకపుపట్టు పట్టినారు. అడవి మృగమైనా యింతపట్టుపట్టదు. మీరు నాజుట్టువదలకపోతే ఠాణాకు పోయి బంట్రోతును తీసుకునివస్తాను.

సుబ - నీఅవకతవకప్రసంగం మానకపోయినట్టయితే యిప్పుడు నాలుగుతన్ని నిన్ను యింట్లోనుంచి అవతలికిసాగనంపుతాను. (తనలో)